Friday, July 24, 2026
E-PAPER

మతలబేంటీ?

- Advertisement -

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను బీఆర్‌ఎస్‌ ఎందుకు డిమాండ్‌ చేయ‌దు
ఆ పార్టీ అవయవదానంతోనే బీజేపీకి అధికారం
కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా సర్‌
మిగిలిన 30 శాతం చాలా కీలకం అవగాహన లేకున్నా.. ఓటు పోయే ప్రమాదం
బీజేపీ నేతల మధ్య అంతర్గత ఘర్షణలు
బీఆర్‌ఎస్‌ తప్పులపై 
విచారణ సాగుతోంది

మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీట్ పేపర్ తో సహా పలు ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన రాజీనామాను డిమాండ్‌ ‌చేస్తూ దేశంలోని యువత, విద్యార్థులు, వివిధ తరగతుల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు చేస్తుంటే బీఆర్ఎస్ మౌనంగా ఉండటం దేనికి సంకేతం అని నిలదీశారు. అసలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న కుమ్మక్కేంటని అడిగారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఓటు చాలా ముఖ్యమనీ, సర్ ప్రకియ లో మిగిలిన 30 శాతం చాలా కీలకమని సీఎం చెప్పారు. ఆ ప్రక్రియలో బీఎల్‌‌వో పాత్ర మరింత కీలకమన్నారు. తన ఓటును కొడంగల్ కు బదిలీ చేసుకున్నట్టు వెల్లడించారు. సర్‌ ‌ప్రక్రియతో గ్రామాల్లోని దళితులు, గిరిజనుల, మైనార్టీల ఓట్లు పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే పథకాలు, ఆధార్, గుర్తింపు, సంక్షేమం దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా సర్ ప్రక్రియ జరుగుతున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకుల మధ్య అంతర్గత ఘర్షణలున్నాయనీ, ఒకరంటే ఒకరికి పడదని సీఎం తెలిపారు. బీఆర్ ఎస్ పేదలకిచ్చే ఇండ్లను దళారులకు అమ్ముకుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఇంటర్మీడియట్ పేపర్లు సరిగ్గా దిద్దక పోవడంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, దానికి కారణమైన గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ ఆరోపించారు. ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలనీ, అమరవీరుల స్థూపం దగ్గర కేటిఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

గ్లోబరీనా సంస్థ పైన కేటీఆర్ సీసీఎస్ లో ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. తాము విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారన్నారు. గ్లోబరినాపై నివేదిక వచ్చాక ఏం చేయాలో అది చేస్తామన్నారు. పరువున్నవారు వేస్తే దాన్ని పరువు నష్టం దావా అంటారన్నారు. జన్వాడ ఫార్మ్ హౌస్ లో ఏ రాజుల భూములున్నాయో విచారణకు డిమాండ్ చేయాలని కేటీఆర్ కు సూచించారు. తాము తిరిగి తెరిచిన ధర్నా చౌక్ లోనే కేటీఆర్ ధర్నా చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. చెరువులను పునరుద్ధరిస్తూ, .ప్రభుత్వ భూములను కాపాడుతూ హైడ్రా బ్రహ్మాండంగా పని చేస్తున్నదని కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్ కు తెలియకుండా కాళేశ్వరం లో వందల కోట్లు రూపాయలను తీసుకున్నాడనే కారణంతోనే హరీశ్‌‌రావును ఆ శాఖ నుంచి తప్పించారని ఆరోపించారు. అతి తెలివితో ఏది పడితే అది మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. తనను ఎందుకు నీటిపారుదల శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. ఎన్డీఎస్ఏ చెప్పింది వినాలా వద్దా? వినియోగంలోకి తేవాలంటే పరీక్షలు చేయాలని చెప్పాక కూడా మేడిగడ్డ ఎక్కడ ఎత్తి పోయాలా? అని ప్రశ్నించారు. పంపులు, బిల్లులు, కమీషన్లు కథ అయిపోయిందనీ, బీఆర్ఎస్ నేతలు కన్నెపెల్లి పంపు హౌజ్ గురించి మాట్లాడుతున్నారనీ, మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ‘మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది బీఆర్ఎస్ వాళ్ళే.

బీఆర్ఎస్ నేతలు సీబీఐ ను మేనేజ్ చేసుకున్నాం. ఎదురుదాడి చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాఫర్ డ్యాం ఎందుకు కట్టలేదు?’ అని సీఎం ప్రశ్నించారు. కన్నె పల్లి పంప్ హౌస్ హరీశ్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి గా ఉన్నప్పుడు నిర్మాణమైందని గుర్తుచేశారు.అతి తెలివి తో మాట్లాడితే పిచ్చి లేసిందని హరీశ్ రావును మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తారని హెచ్చరించారు. కాళేశ్వరం లో గేట్లు ఎత్తి వేయాలని నిపుణులు స్పష్టం చేశారనీ, ఎన్డీఎస్ ఏ చైర్మెన్ స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారని తెలిపారు. ఈ విషయం గురించి హరీశ్ రావు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేవాదులలో అన్ని పంపులు పని చేస్తున్నాయనీ, మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ ఆకాశం నుంచి దిగి రాదనీ, మరో డ్యామ్ కట్టేందుకు ఐదు మీటర్ల నీళ్లు ఉండాలంటే మేడిగడ్డ గేట్లు దిగాల్సిందేననీ స్పష్టం చేశారు. ఒక్క రోజు మాత్రమే లక్ష క్యూ సెక్కుల నీళ్లు వచ్చాయనీ, నీళ్లు నిలపకపోతే బ్యారేజ్ లు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. మేడిగడ్డ అంటే ప్రజలు తన్నుతారనే కన్నె పల్లి పంప్ హౌస్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పైన ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ నివేదిక స్పష్టం ఉందనీ, కాళేశ్వరం పైన సీబీఐ విచారణను కోరామని ఆయన గుర్తుచేశారు.

బీఆర్ఎస్ అవయవదానంతో బీజేపీకి అధికారం
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందనీ, అందులో బీఆర్ఎస్ కు అధికారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట ,గజ్వేల్, సిరిసిల్ల లో లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మెజారిటీ వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు రక్తం ధారపోశారే తప్ప కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు, సంతోశ్‌రావు చుక్క రక్తం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా పేదల రక్తం అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ పైన అసెంబ్లీ లో కేటీఆర్ ప్రశ్నిస్తే, పేర్ల తో సహా నియామకాల లిస్ట్ ఇస్తానని సీఎం స్పష్ఠం చేశారు. ఉద్యోగాలపై చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రశ్నపత్రం అమ్ముకోవడం బీఆర్ఎస్ విధానమైతే నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం తమ విధానమని తెలిపారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. 55 రోజుల్లో 11 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఆహార కల్తీపై కఠినంగా ఉన్నామని తెలిపారు. ఐదు లక్షల పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇండ్లను బ్రోకర్లు అమ్ముకునే వ్యవస్థను బీఆర్ఎస్ నేతలు తెచ్చారని సీఎం ఆరోపించారు. తాము ఏం చేస్తున్నామో అదే చెబుతున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండమని కేటీఆర్ అన్న విషయాన్ని గుర్తుచేశారు. కేటీఆర్ దావత్ ఇస్తే తాను తీసుకోలేనేమోననీ, కేటీఆర్ వి అన్ని వేరే పార్టీలని సెటైర్ వేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ రక్తదానం చేయలేదనీ, ఇతరులు ఇచ్చిన రక్తం ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలన్నారు. తీసిన రక్తం గాంధీకి, ఉస్మానియాకు ఇస్తే బాగుండేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకున్న వారే ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారన్నారు. పెట్టుబడి పెట్టాడు కాబట్టే రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టామన్నారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా తమ విధానం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలుంటాయని చెప్పారు. బీఆర్ఎస్ తప్పులపై విచారణ జరుగుతోందని చెప్పారు. తనకు నచ్చలేదని వెంటనే శిక్ష వేయాలా? అని ప్రశ్నించారు. చార్లెస్ శోభ రాజు, బిల్లా రంగాలు కూడా జైల్లో ఉన్నారనీ, జైలుకు వెళ్తే ముఖ్యమంత్రులు అవుతారా? అని అడిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -