అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల నిరసన గళ
నవతెలంగాణ – నవాబు పేట
నవాబ్‌పేట, తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదు. మండల పరిధిలోని ఎన్మనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రవాణా సౌకర్యం లేక, కనీసం తాగడానికి గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. సోమవారం విద్యార్థినులు గ్రామానికి చెందిన తాణెం సత్యనారాయణతో కలిసి తమ గోడును పత్రికా ముఖంగా వెళ్లబోసుకున్నారు.
బస్సులు ఆపరు.. భద్రత కరువు
పాఠశాల సమయం ముగిసిన తర్వాత విద్యార్థులు తమ గ్రామాలకు చేరుకోవాలంటే బస్టాండ్ లలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గ్రామం మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు స్టాప్‌లో ఆపకుండా వెళ్తుండటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడే వరకు రోడ్డుపైనే ఉండాల్సి వస్తోందని, తమకు ఏదైనా అపాయం జరిగితే విద్యాశాఖ గానీ, రవాణా శాఖ గానీ బాధ్యత వహిస్తాయా? అని వారు నిలదీశారు. అధికారుల కళ్లు గప్పి డ్రైవర్లు బస్సులను వేగంగా పోనిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
మిషన్ భగీరథ నీళ్లు ఏవీ?
ఇక పాఠశాల ఆవరణలో తాగునీటి సమస్య రాజ్యమేలుతోంది. మండుతున్న ఎండల్లో విద్యార్థులు దాహార్తిని తీర్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ట్యాంకులు వెక్కిరిస్తున్నాయి. ‘అందరికీ నీళ్లు’ అనే ప్రభుత్వ నినాదం ఈ స్కూల్ వరకు చేరలేదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బస్సు నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో తాగునీటి వసతి కల్పించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగుతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.



