Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌‌తోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

‌సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌‌తోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

- Advertisement -

జాతీయ సైబర్‌ భద్రతా ప్రమాణాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి : వీడియో కాన్ఫరెన్స్‌‌లో 
డీజీపీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌‌తోనే సైబర్‌ ‌నేరాలకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్ల అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్‌) అమలుపై సమగ్రంగా సమీ‌క్షించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌ ‌మాట్లాడుతూ
ప్రధానమంత్రి ప్రగతి వేదిక ద్వారా దేశవ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు, పాలనకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఐ4సీ నిర్దేశించిన తొమ్మిది కీలక ప్రమాణాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రాష్ట్రాల సైబర్ భద్రత పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని వివరించారు. మొత్తం తొమ్మిది కీలక పనితీరు సూచికల ఆధారంగా రాష్ట్రాలకు జాతీయ ర్యాంకులు కేటాయిస్తారని అన్నారు. ఆ అన్ని అంశాల్లో తెలంగాణ పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించాలని సూచించారు.

ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమలు వేగవంతం చేయాలి
రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ అమలు ఇంకా పూర్తిస్థాయిలో జరగాల్సి ఉందని డీజీపీ అన్నారు. ప్రతి యూనిట్ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జాతీయ ర్యాంకుల్లో మరింత మెరుగుదల లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో కొంత వెనుకబడి ఉన్నామని వివరించారు. ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమల్లో 13వ స్థానం, మనీ రిస్టోరేషన్‌‌లో 18వ స్థానం, జీఆర్‌ఎం పనితీరులో నాలుగో స్థానం, సహయోగ్ పోర్టల్‌లో 16వ స్థానం, సమన్వయ పోర్టల్‌లో ఆరో స్థానం, సోషల్ మీడియా సంబంధిత పనితీరులో 16వ స్థానం, సైబర్ సెక్యూరిటీ ప్రమాణాల్లో 15వ స్థానం, కెపాసిటీ బిల్డింగ్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్నామని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. సాంకేతిక ఆధారిత దర్యాప్తు విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సైబర్ నేరాల దర్యాప్తుతోపాటు సాధారణ పోలీసింగ్‌లో కూడా సీసీటీఎన్‌ఎస్ వినియోగాన్ని మరింత పెంచాలనీ, పూర్తిస్థాయిలో వినియోగించి దర్యాప్తు నాణ్యతను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్, టీ-స్పార్క్ ఎస్పీ రూపేశ్‌, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీతోపాటు రాష్ట్రంలోని వివిధ పోలీసు యూనిట్ల సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -