సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను సక్సెస్ చేసేందుకు అధికారులంతా సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరుగనున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లపై బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని చెప్పారు. దేశ, విదేశాల్లో రోడ్‌షోలు, వార్‌రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారని చెప్పారు. పనుల రూపకల్పన, బడ్జెట్ అంచనాలు, ఆమోదాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికారుల కమిటీలతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి, వాటికి సంబంధిత మంత్రులను చైర్‌పర్సన్లుగా నియమించామన్నారు. ప్రతి కమిటీకి కన్వీనర్లను కూడా నియమించామనీ, వారు వెంటనే సంబంధిత మంత్రులను కలిసి బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించాలని సూచించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజూ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని చెప్పారు. అలాగే తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఏ దేశంలో ఏ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా రోడ్‌షోల ప్రణాళిక రూపొందించి మంత్రిమండలి ఉపసంఘానికి నివేదించాలని అధికారు లను ఆదేశించారు. అనంతరం కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసి రోడ్‌షోలను ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం అనుకుంటున్న 4 సభా ప్రాంగణాలను 6 లేదా 8కి పెంచేందుకు సిద్ధంగా ఉండాలనీ, పనుల భాగస్వామ్యంలో ఎక్కడా రాజీ పడొద్దని అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, విశిష్టత ప్రతిబింబించేలా ఈవెంట్ ని నిర్వహించాలని సూచించారు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, ఇక్కడి ప్రత్యేక వంటకాలు దీనిలో ప్రధానంగా ఉండాలన్నారు. సాంస్కృతిక శాఖ సమన్వయంతో గ్లోబల్ సమ్మిట్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
‘గ్లోబల్’ను సక్సెస్ చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



