Sunday, July 26, 2026
E-PAPER
Homeఆటలుసిరీస్‌ సొంతమాయె

సిరీస్‌ సొంతమాయె

- Advertisement -

రెండో టీ20లో భారత్‌ భారీ విజయం
రాణించిన ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ
భారత్‌ 219/5, జింబాబ్వే 129/10

బ్రిటన్‌ ‌పర్యటనలో వరుస ఓటములను నుంచి పుంజుకున్న టీమ్‌ ఇండియా.. జింబాబ్వేపై టీ20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు కలిసికట్టుగా రాణించటంతో రెండో టీ20లో భారత్‌ 90 ‌పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. ఇషాన్‌ ‌కిషన్‌ (81), తిలక్‌ ‌వర్మ (60), ప్రిన్స్‌ ‌యాదవ్‌ (2/10), యశ్‌ ‌ఠాకూర్‌ (2/30) రాణించారు.

​నవతెలంగాణ-హరారే
వరుస విజయాలతో జోరందుకున్న టీమ్‌ ఇండియా జింబాబ్వేపై టీ20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్‌ ‌క్లబ్‌‌లో జరిగిన రెండో టీ20లో భారత్‌ 90 ‌పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇషాన్‌ ‌కిషన్‌ (81, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌లు), తిలక్‌ ‌వర్మ (60 నాటౌట్‌, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో తొలుత భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. యువ పేసర్లు ప్రిన్స్‌ ‌యాదవ్‌ (2/10), యశ్‌ ‌ఠాకూర్‌ (2/30)కి తోడు పార్ట్‌‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ ‌శర్మ (3/17) ‌మూడు వికెట్లతో మాయ చేశాడు. ఇషాన్‌ ‌కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌’గా నిలిచాడు.

​కిషన్‌, తిలక్‌ ‌మెరువగా
బ్రిటన్‌ ‌పర్యటన నుంచి జింబాబ్వేతో తొలి మ్యాచ్‌ ‌వరకు ఇషాన్‌ ‌కిషన్‌ ‌మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. క్రీజులో స్వేచ్ఛగా కదిలినా.. వికెట్‌ ‌కోల్పోతూ నిరాశపరిచాడు. హరారే స్పోర్ట్స్‌ ‌క్లబ్‌‌లో కిషన్‌ ఆ ట్రెండ్‌‌కు ముగింపు పలికాడు. ఆరు ఫోర్లతో 31 బంతుల్లో అర్థ సెంచరీ సాధించి సత్తా చాటాడు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన ఇషాన్‌ ‌కిషన్‌.. భారత ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. ఓపెనర్లు వైభవ్‌ ‌సూర్యవంశీ (20, 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ ‌శర్మ (8, 8 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశపరిచినా.. కెప్టెన్‌ ‌శ్రేయస్‌ అయ్యర్‌ (25, 20 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ‌నెమ్మదిగా ఆడినా.. అర్థ సెంచరీ తర్వాత కిషన్‌ ‌టాప్‌ ‌గేర్‌‌లో చెలరేగాడు. మరో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో దంచికొట్టాడు. శ్రేయస్ అవుటైనా.. తిలక్‌ ‌వర్మ (60 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో భారత్‌‌కు భారీ స్కోరు అందించాడు. 3 సిక్స్‌‌లు, 5 ఫోర్లతో తిలక్‌ ‌మెరిశాడు. రింకు సింగ్‌ (12) ఓ సిక్సర్‌‌తో మెరువగా.. శివమ్‌ ‌దూబె (6 నాటౌట్‌) ఓ ఫోర్‌‌తో అలరించాడు.

​విజృంభించిన బౌలర్లు
220 పరుగుల భారీ ఛేదనలో ఆతిథ్య జింబాబ్వే చేతులెత్తేసింది. యువ పేసర్లు ప్రిన్స్‌ ‌యాదవ్‌, యశ్ ఠాకూర్‌‌లు టాప్‌ ఆర్డర్‌‌ను కకావికలం చేశారు. అరంగ్రేట మ్యాచ్‌‌లోనే యశ్‌ ఠాకూర్‌ ‌రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రియాన్‌ ‌బెనెట్‌ (32, 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) వికెట్‌తో వికెట్ల పతనానికి నాంది పలికాడు. మరో ఓపెనర్‌ ‌బెన్‌ ‌కరణ్‌ (1)‌ను ప్రిన్స్‌ ‌యాదవ్‌ ‌సాగనంపాడు. కెప్టెన్‌ ‌సికిందర్‌ ‌రజా (0)ను ప్రిన్స్‌ ‌యాదవ్‌ ‌డకౌట్‌ ‌చేయటంతో జింబాబ్వే పోరాటం నామమాత్రమైంది. మేయర్స్‌ (12), బర్ల్‌ (20), వెస్లీ (2) తేలిపోయారు. మారుమణి (24), బ్రాడ్‌ ఎవాన్స్‌ (19) ‌జింబాబ్వే స్కోరును మూడెంకలు దాటేలా చేశారు. పార్ట్‌ ‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ ‌శర్మ వరుసగా మూడు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి మాయాజాలం చేశాడు. 17.5 ఓవర్లలో 129 పరుగులకు జింబాబ్వే ఆలౌటైంది. 90 పరుగుల తేడాతో భారత్‌ ‌ఘన విజయం సాధించింది.

​సంక్షిప్త స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : 219/5 (ఇషాన్‌‌ కిషన్‌ 81, తిలక్‌ ‌వర్మ 60, శ్రేయస్‌ అయ్యర్‌ 25, ముజరబాణి 1/36, న్యూమాన్‌ 1/25)
జింబాబ్వే ఇన్నింగ్స్‌ : 129/10 (బ్రయాన్‌ ‌బెనెట్‌ 32, మారుమణి 24, అభిషేక్‌ ‌శర్మ 3/17, ప్రిన్స్‌ ‌యాదవ్‌ 2/10, యశ్‌ ‌ఠాకూర్‌ 2/30)

క్లీన్‌‌స్వీప్‌‌పై కన్నేసి..
తొలి రెండు మ్యాచ్‌‌ల్లో విజయంతో 2-0తో సిరీస్‌ ‌ఖాతాలో వేసుకున్న భారత్‌.. క్లీన్‌‌స్వీప్‌‌పై కన్నేసి నేడు ఆఖరు మ్యాచ్‌ ‌బరిలోకి దిగుతోంది. భారత్‌, జింబాబ్వే మూడో టీ20 నేడు హరారే స్పోర్ట్స్‌ ‌క్లబ్‌‌లో జరుగనుంది. ఒక్క రోజు విరామం లేకుండా ‌చివరి రెండు మ్యాచ్‌‌లు షెడ్యూల్‌ ‌చేయటంతో ఇరు జట్ల ‌బౌలర్ల సత్తాకు ఇది పరీక్షగా నిలువనుంది. యువ బౌలర్ల మెరుపులతో భారత్‌ ‌ముచ్చటగా మూడో విజయం సాధించాలని చూస్తుండగా.. ఆఖరు మ్యాచ్‌‌లోనైనా పైచేయి సాధించాలనే పట్టుదల జింబాబ్వే శిబిరంలో కనిపిస్తోంది. భారత్‌, జింబాబ్వే మూడో టీ20 నేడు సాయంత్రం 4.30 నుంచి ఆరంభం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -