పరిశోధన
తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని చాంద గ్రామంలో ఎన్నో విడిశిల్పాలు శిథిలస్థితిలో కనిపిస్తున్నాయి. వాటిలో అరుదైనది, శిల్పపరంగా ప్రత్యేక ప్రతిమాలక్షణాలతో ఉన్న పార్శ్వనాథుని శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు పృథ్విరాజ్ రొడ్డావార్, సహచరులు సాయిరాజ్ కాంబ్లే, కత్తురి సుభాష్ లతో కలిసి గుర్తించాడు.
ఈ శిల్పానికి తల విరిగిపోయింది. అర్థపద్మాసనంలో ఆసీనుడైవున్న మూర్తి వెనక పాము చుట్టుకుని కన్పిస్తున్నది. మూర్తికి రెండువైపుల కాయోత్సర్గభంగిమలో ఇద్దరు తీర్థంకరులున్నారు. అధిష్టానపీఠం మీద రెండు సింహాల నడుమ ధర్మచక్రం వుంది. రెండువైపుల సర్పఛత్రంతో జైనయక్షుడు ధరణీంద్రుడు, యక్షిణి పద్మావతులున్నారు. వారికి వెలుపల ఇద్దరు శ్రావక, శ్రావికలు నమస్కరిస్తున్నట్టు చెక్కివున్నది. శిల్పశైలినిబట్టి పార్శ్వనాథుని శిల్పం 9వ శతాబ్దానికి చెందిందని ఈ శిల్పాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఇటువంటి పోలికలతో భారత మ్యూజియం ఆర్కియాలజీ విభాగం బీహార్ రాష్ట్రం రాజగిర్ లో లభించిన పార్శ్వనాథుని శిల్పం, మహారాష్ట్రలోని తూర్పుఖాందేశ్ ఎరందోల్ లో అగుపించిన పార్శ్వనాథుని శిల్పం అధిష్టానాలమీద ధర్మచక్రం చెక్కివున్నదని జైన ప్రతిమాలక్షణగ్రంథం ‘జైన రూపమండన’లో పేర్కొనబడ్డదని అన్నారు.
ధర్మచక్రం ఉంది కనుక బుద్ధుని శిల్పమనుకోవచ్చు. కాని, బుద్ధుడైతే ధర్మచక్రపరివర్తన ముద్రతో ఆసీనుడై కనిపించాలి. అతని దేహంపై సంఘాతి ఉండాలి. అవి లేవు కనుక ఈ శిల్పం బుద్ధునిది కాదు. ఇటువంటి శిల్పం గతంలో తెలంగాణారాష్ట్రంలో ఎక్కడా లభించలేదని, ఈ శిల్పం అపురూపమైనదని స్థపతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా. ఈమని శివనాగిరెడ్డిగారు అన్నారు.
చాందలోనే లభించిన మరొక శిల్పం ఎడమవైపు పై ముక్కలో అభిషేకిస్తున్న ఏనుగు, దానికింద రెండు వరుసల్లో ముగ్గురేసి జైనతీర్థంకరులు అగుపిస్తున్నారు. ఇది జైనరూపమండన ప్రకారం మరొక పార్శ్వనాథుని శిల్పంలోని భాగమని తెలుస్తున్నది. గతంలో ఇక్కడే 17వ జైన తీర్థంకరుడు ‘కుంథునాథు’ని శిథిల శిల్పాన్ని గుర్తించాడు పృథ్విరాజ్ రొడ్డావార్. ఇన్ని జైనధర్మ శిల్పాలు లభించిన చాంద జైనబసదిగా వుండేదని చెప్పవచ్చు.
క్షేత్ర పరిశోధన, ఫోటోగ్రఫీ: పృథ్విరాజ్ రొడ్డావార్, సభ్యుడు, కొత్త తెలంగాణచరిత్రబృందం, 9701361356
ప్రతిమాలక్షణ వివరణ: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణచరిత్రబృందం, 9949498698
చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు
- Advertisement -
- Advertisement -



