సీజేపీ ఆందోళనలో గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స
పరామర్శకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను అడ్డుకున్న పోలీసులు
అమిత్ షా రాజీనామా చేయాలి : జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జరిగిన పార్లమెంట్ మార్చ్ లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం నాడిక్కడ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువతను పరామర్శించడానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. అరుణ్‌కుమార్, ఎంపీలు జాన్ బ్రిట్టాస్, ఎఎ రహీం, డీవైఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టాచార్య, కేంద్ర కార్యవర్గ సభ్యుడు జెక్ సి థామస్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్యలను వెళ్లారు. చికిత్స పొందుతున్న వారి వివరాలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఆస్పత్రి అధికారులు కూడా సిద్ధంగా లేరు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఢిల్లీ వాసి సాక్షి (21) వివరాలను కూడా అధికారులు వెల్లడించడం లేదు. సాక్షిని కలవడానికి, సహాయం అందించడానికి సీపీఐ(ఎం) నాయకులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించాయి. ఆర్ఎంఎల్ ఆస్పత్రి కాకుండా ఢిల్లీలోని మరెక్కడ గాయపడిన వారికి చికిత్స జరుగుతుందో కూడా స్పష్టత లేదు. నిరసనలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, గాయపడిన వారిని ఆస్పత్రిలోనే నిర్బంధిస్తోంది.
అమిత్ షా రాజీనామా చేయాలి: జాన్ బ్రిట్టాస్
ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ఢిల్లీ పోలీసులు, అమిత్ షా పూర్తి నియంత్రణలో ఉన్నాయని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. “ఆస్పత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు కూడా స్వేచ్ఛ లేదు. ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన పిల్లలను చూడటానికి వారి బంధువులను గానీ, ఎంపిలను గానీ అనుమతించడం లేదు” అని విమర్శించారు. “నిరసన తెలిపిన యువతను తాను గౌరవిస్తానని హోం మంత్రి అమిత్ షా అన్నారు. కానీ 20వ తేదీన ఆ గౌరవం ఎక్కడ ఉంది? స్వతంత్ర భారతదేశ చరిత్రలో విద్యార్థులను ఇంత దారుణంగా ఎప్పుడూ కొట్టలేదు. దీనికి బాధ్యుడైన అమిత్ షా రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.



