మసకబారిన ప్రధాని ప్రతిష్ట
మోడీని ఢీకొన్న యువోద్యమం
దిగిరాక తప్పని పరిస్థితి కల్పించిన భావితరం
హక్కుల కోసం ఏకమవుతున్న జెన్-జీ తరం
ప్రపంచంలోనే ‘బలమైన నాయకుడు మోడీ’ అని బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా విస్రృత ప్రచారం కల్పించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించిన ‘స్వామి భక్తులు’కు ఎదురుదెబ్బ తగిలింది. 12 ఏండ్లుగా ఇదే ప్రచారాన్ని ఆపార్టీ చిత్రీకరిస్తూ వస్తుంది. దాన్ని ప్రధాని ఏనాడూ వారించలేదు. అలాగని సమర్థించనూ లేదు. అలాంటి భావన ప్రజల్లో ఉండాల్సిందే అని భ్రమించినట్టున్నారు. ఇప్పుడు ఆ భ్రమల్ని జెన్-జీ విద్యార్థి ఉద్యమం తొలగించింది. ‘మోడీకి అంత సీన్ లేదు’ అని చెప్పకనే చెప్పేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించింది. ఈ పరాజయంపై ప్రధాని మోడీ అటు యువతరానికి, ఇటు పార్లమెంటుకు ముఖం చూపలేక సతమతమవుతున్నారు.
న్యూఢిల్లీ : పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, మూల్యాంకనంలో లోపాలపై ప్రారంభమైన విద్యార్థుల నిరసనలను కేంద్ర ప్రభుత్వం పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రధాని మోడీ రాజకీయ ప్రతిష్ఠకు ఎదురుదెబ్బగా మారింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోరిన యువత ఉద్యమాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో ఎదుర్కోవాలని చూసింది. చివరకు అది క్రమంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. న్యూఢిల్లీలో పార్లమెంట్ వెలుపల వేలాది మంది విద్యార్థులు ‘నీట్’ సహా పలు పరీక్షల అవకతవకల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ సహా పలు రాజకీయపార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఈ యువోద్యమాన్ని అణచివేసేందుకు ప్రధాని మోడీ పోలీస్ యాక్షన్‌నే నమ్ముకున్నారు. అదే సమస్యల్ని మరింత జటిలం చేసింది. యువోద్యమం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. లండన్ నుంచి సిడ్నీ వరకు ప్రవాస భారతీయులు కూడా సంఘీభావ ప్రదర్శనలు చేపట్టారు. ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు పరీక్షా పత్రాల లీకేజీ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించినా, యువోద్యమం వెనక్కి తగ్గలేదు.
రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి
2024 లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ కోల్పోయిన తర్వాత భారత్‌లోని పలు రాష్ట్రాల్లో అధికారాన్ని విస్తరించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించిన అనంతరం ఉత్తర భారతం లోని రాష్ట్రాలకు అనుకూలంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేపట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే యువోద్యమం విస్తరించింది. మోడీ ప్రాభవాన్ని తగ్గించేసింది. దీనితో భవిష్యత్ ఎన్నికలపై బీజేపీకి చింత పట్టుకుందని ఆపార్టీ రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తున్న వారు అభ్రిపాయపడుతున్నారు.
‘కాక్రోచ్’ను తక్కువ అంచనా వేసి…
నిరుద్యోగ యువతను ఎగతాళి చేస్తూ రూపొందించిన ఒక ఏఐ మీమ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని ప్రభుత్వం మొదట సీరియస్‌గా తీసుకోలేదు. అది మహోద్యమంగా జాతీయ స్థాయికి విస్తరిస్తుందని బీజేపీ ఊహించలేదు. అప్పటికీ సీజేపీ ప్రతిష్టను తగ్గించేలా, ఖాన్‌లు, పాకిస్తాన్‌లు అంటూ సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టించినా, అవేవీ విద్యార్థి, యువోద్యమం ధాటికి నిలువలేకపోయాయి. గతంలో రైతు ఉద్యామాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఇదే తరహాలో అణచివేసే చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. చివరకు ప్రధాని దిగివచ్చి దేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితులు పునరావృతమయ్యాయి. కానీ ఈసారి యువతరం ఉవ్వెత్తున ఎగసిపడి, ఉద్యమాన్ని ముందుకు నడిపింది. దీన్ని అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఉపాధి సంక్షోభమే అసలు సమస్య భారత్‌లో చదువు పూర్తిచేసినా యువతకు మాత్రం ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఉన్నత విద్యార్హతలకు లభించే ఆర్థిక ప్రయోజనం క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బెంగళూరును కలిగి ఉన్న కర్నాటక వంటి రాష్ట్రంలో కూడా ఐదుగురిలో ఒకరికి యువత విద్య, ఉపాధి, శిక్షణ సహా దేనిలోనూ లేకపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
జెన్-జీకి పరీక్షలే ఆశాకిరణం
దాదాపు 40 కోట్ల జెన్-జీ యువత నాణ్యమైన విద్య, ఉద్యోగాల కోసం పోటీపడుతున్న భారతదేశంలో ప్రభుత్వ పరీక్షలే సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రధాన మార్గం. అలాంటి మార్గాన్ని కేంద్రం దాదాపు మూసివేసి, అవినీతిమయం చేసేసిందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. అలాంటి పరీక్షలే లీక్ కావడం, రద్దవడం వల్ల యువత ఆశలు ఛిన్నాభిన్నమై, కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి.
సంక్షేమ రాజకీయాలపై ప్రశ్నలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గడచిన 12 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల హక్కులుగా కాకుండా, నాయకుడి వరాలుగా ప్రచారం చేసింది. మోడీని బలమైన నేతగా చెప్పుకుంది. అయితే ఇప్పుడు విద్యార్థులు పారదర్శక పాలన, నిష్పక్షపాత పరీక్షా వ్యవస్థను తమ హక్కుగా డిమాండ్ చేయడంతో సర్కారు వ్యవస్థల్లోని డొల్లతనం వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రంపై తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గినా, జెన్-జీ సాధించిన విజయం యువతలో ఇకపై మరిన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రతిపక్షానికి కొత్త అవకాశం
సంస్థాగతంగా సీజేపీకి, ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే స్థాయి లేకపోయినా, ఈ ఉద్యమం వల్ల కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలకు రాజకీయ ఊతం లభించినట్టయ్యింది. ప్రధాని నివాసం ఎదుట చేపట్టిన నిరసనలో రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా ప్రతిపక్షాలకు అనుకూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు.
2011 ఉద్యమాన్ని గుర్తు చేస్తున్న పరిణామాలు
2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసింది. అదే ప్రజాభిప్రాయం బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఇప్పుడు యువత హక్కుల కోసం ఏకమవుతున్న ఉద్యమం కూడా భారత రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆండీ ముఖర్జీ వివరించారు. ఒక నాయకుడో, ఒక ప్రభుత్వమో అజేయమనే భావనను భారత యువత సవాలు చేసి, తిప్పికొట్టడంలో విజయం సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.



