జై జవాన్ – జై కిసాన్ –
జై యువ అని నినదించండి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి వయస్సు 21 ఏండ్లకు తగ్గించాలి
తీర్మానాన్ని ఉభయ సభల్లో అమోదించి కేంద్రానికి పంపిస్తాం
ఢిల్లీ ఉద్యమ బాధిత కుటుంబాలకు సాయం అందించాలి :జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యువశక్తే దేశ భవిష్యత్‌కు పునాదిగా నిలుస్తుందని, అందుకే ‘జై జవాన్ – జై కిసాన్ – జై యువ’ అని నినదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్రిపాయపడ్డారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల కనిష్ఠ వయోపరిమితి ని 25 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జాతీయ మీడియా ప్రతినిధులు ఆదివారం హైద రాబాద్‌లో ఆయనను కలిసిన సందర్భంలో పలు విషయాల పై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు, అదేస్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన సీబీఎస్‌ఈ, నీట్, నెట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి కుటుంబాల ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను సమీక్షించడంతో పాటు నష్టపోయిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నేటి యువత 21 ఏండ్ల వయస్సులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా సేవలందిస్తోందని, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహిస్తోందన్నారు.
ప్రపంచస్థాయి సంస్థలకు సైతం నాయకత్వం వహిస్తోందని వెల్లడించారు. సాంకేతిక, పరిపాలనా, వ్యాపార రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్న యువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించిన విషయాన్ని, 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 21 ఏండ్లకు సవరించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 25 నుంచి 21 ఏండ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 30 నుంచి 25 ఏండ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ అంశంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ఆగస్టు నెలలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం పోటీ వయోపరిమితి తగ్గింపును కోరుతూ అధికారిక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ సీట్ల పెంపుదల, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను మరింత విస్తరించడం దేశ భవిష్యత్‌కు అవసరమని ఆయన తెలిపారు.



