నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం తెలంగాణపై ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ సూచన ప్రకారం, బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.



