వెయిట్‌లిఫ్టింగ్‌లో అజయ బాబుకు రజతం
గ్లాస్గో 2026 కామన్‌వెల్త్ క్రీడలు
గ్లాస్గో (స్కాట్లాండ్)
గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో తెలుగు వెలుగు. తెలుగు తేజం, విజయనగరం జిల్లాకు చెందిన వల్లూరి అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించాడు. సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి అజయ బాబు పతక ప్రదర్శన కనబరిచాడు. స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు ఎత్తిన అజయ బాబు.. ఓవరాల్‌గా 330 కేజీలు ఎత్తిపడేశాడు. 331 కేజీలతో మలేషియా వెయిట్‌లిఫ్టర్ మహ్మద్ హిదయత్ పసిడి పతకం సాధించాడు. స్నాచ్‌లో 149 కేజీలతో అజయ బాబు ముందంజలో నిలువగా.. 147 కేజీలతో హిదయత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. కానీ క్లీన్ అండ్ జెర్క్‌లో హిదయత్ 184 కేజీలు అవలీలగా ఎత్తాడు. దీంతో స్నాచ్‌లో లోటును అధిగమించి అజయ బాబును వెనక్కి నెట్టాడు. ఇంగ్లాండ్ వెయిట్‌లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీలతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఇక పురుషుల హై జంప్‌లో సర్వేశ్ అనిల్ కుశారె సైతం రజత పతకం సాధించాడు. ఫైనల్లో 2.25 మీటర్ల జంప్‌తో సర్వేశ్ రెండో స్థానంలో నిలిచాడు. జమైకా అథ్లెట్ 2.25 మీటర్లతో పసిడి పతకం సాధించాడు. సర్వేశ్, జమైకా అథ్లెట్ సమవుజ్జీలుగా నిలిచినా.. తక్కువ ఫెయిల్యూర్స్ (కౌంట్‌బ్యాక్ రూల్) ప్రాతిపదికన జమైకా అథ్లెట్‌కు పసిడి పతకం అందించారు.
షర్మిళకు స్వర్ణం
గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో పారా అథ్లెట్ షర్మిళ చరిత్ర సృష్టించింది. సీజన్ బెస్ట్ ప్రదర్శనతో షర్మిళ పసిడి పతకం నెగ్గింది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్57) ఫైనల్లో షర్మిళ అగ్రస్థానంలో నిలిచింది. 9.81 మీటర్ల దూరంతో పసిడి పతకం సొంతం చేసుకుంది. బంగారు పతకం సాధించిన షర్మిళ.. కామన్‌వెల్త్ క్రీడల్లో పారా పసిడి నెగ్గిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడిన శిల్పా కంచుగారకొప్పలు శ్యాల కాంస్య పతకం దక్కించుకుంది. 7.26 మీటర్ల దూరంతో ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసిన శిల్పా మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించింది. ఓ పారా అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత పారా అథ్లెట్లు రెండు పతకాలు సాధించటం ఇదే ప్రథమం.
2010లో తండ్రి..2026లో తనయుడు
2004లో జన్మించిన అజయ బాబుది క్రీడా నేపథ్యం కలిగిన కుటుంబం. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాస రావు సైతం వెయిట్‌లిఫ్టర్. అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించాడు. 2003 ఆఫ్రో ఏసియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్‌తో మొదలైన శ్రీనివాస రావు పతక ప్రస్థానం.. కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం అందుకునే వరకు సాగింది. 2010 ఢిల్లీ కామన్‌వెల్త్ క్రీడలకు ఓ నెల రోజుల ముంగిట శ్రీనివాస రావుకు గాయమైనా.. మెన్స్ 56 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు, 2009లో కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇదే విభాగంలో పసిడి పతకం దక్కించుకున్నాడు. 2011 నేషనల్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన శ్రీనివాస రావు.. 2010 ఆసియా క్రీడల్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శ్రీనివాస రావు ఇద్దరు కుమారులు వెయిట్‌లిఫ్టర్లు కాగా.. అజయ బాబు గ్లాస్గోలో తండ్రిని మించిన ప్రదర్శన కనబరిచాడు. తండ్రి శ్రీనివాసరావు (ఇండియన్ ఆర్మీ) స్ఫూర్తితో అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగుపెట్టాడు. తండ్రి శిక్షణ సారథ్యంలోనే అజయ బాబు ట్రైనింగ్ కొనసాగింది. జాతీయ స్థాయిలో పోటీల్లో సత్తా చాటడంతో అజయ బాబుకు ప్రొఫెషనల్ శిక్షణ నిమిత్తం ఎన్‌ఐఎస్ పటియాలలో చేర్చుకున్నారు. ఇక్కడ శిక్షణతో రాటుదేలిన అజయ బాబు.. వర్థమాన వెయిట్‌లిఫ్టర్లలో మేటిగా ఎదిగాడు. 2024 ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్, 2024 కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ (జూనియర్)లో బంగారు పతకం సాధించాడు. సీనియర్ లెవల్‌లో 2024 , 2025 కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా పసిడి పతకాలతో మెరిశాడు. తాజాగా గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో అజయ బాబు సిల్వర్ మెడల్‌తో సత్తా చాటాడు.



