Tuesday, September 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌తెలంగాణకు 
చీకటిరోజు

‌తెలంగాణకు 
చీకటిరోజు

- Advertisement -

4 కోట్ల ప్రజలకు ఇది అవమానం
కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి
తాతా మధును బర్తరఫ్‌ చేయాలి: స్పీకర్‌‌పై వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఖండించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సభలో సీఎం అయినా, సభ్యుడైనా సమానమేనని అన్నారు. స్పీకర్‌‌పై సభ్యసమాజం తలదించుకునేలా కొందరు మాట్లాడారని చెప్పారు. ఇది సభకు జరిగిన అవమానమని అన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానమనీ, తెలంగాణకు ఇది చీకటిరోజని చెప్పారు. అనుచిత భాషతో దూషించడం క్షమించరాని నేరమని అన్నారు. ఇది దళితులకు జరిగిన అవమానం కాదనీ, అందరికీ జరిగిన అవమానమని వివరించారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తాననీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తాననీ, దళితబంధు ఇస్తానని కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ ‌చేశారని అన్నారు. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను చంపారని చెప్పారు. దళితుడు సీఎల్పీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారని వివరించారు. బీఆర్‌ఎస్‌‌ది దళిత వ్యతిరేక ఆలోచన అని విమర్శించారు. స్పీకర్‌ ‌తల్లిని అవమానించేలా మాట్లాడటాన్ని ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. అసహ్యకరమైన, జుగుప్సాకరమైన భాషను వాడారని చెప్పారు. ప్రజాప్రతినిధులు వాడే భాషపై చర్చించాలన్నారు. రాజకీయాలకతీతంగా స్పందించాలని కోరారు. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలని చెప్పారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తే దాన్ని చాతకానితనంగా అనుకుంటున్నారని అన్నారు. అదిరించి బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకోవాలని అనుకుంటూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తాతా మధుతో రాజీనామా చేయించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ సభ్యుడిని డిస్మిస్‌ ‌చేయాలన్నారు. శాసనమండలి చైర్మెన్‌ ఆసభ్యుడిని బర్తరఫ్‌ ‌చేయాలని కోరారు.
​తాతా మధు వెనుక కేసీఆర్‌ : అడ్లూరి
తాతా మధు వ్యాఖ్యల వెనుక కేసీఆర్‌ ఉన్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌ అన్నారు. తాతా మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు.
​ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ : మహేశ్వర్‌‌రెడ్డి
స్పీకర్‌‌పై మాట్లాడిన వ్యాఖ్యలను బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి ఖండించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని అన్నారు. ఆ సభ్యుడిని బర్తరఫ్‌ ‌చేయాలని కోరారు.
​ఎంఐఎం ఖండన
స్పీకర్‌‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం సభ్యులు అహ్మద్‌‌బిన్‌ అబ్దుల్లా బలాలా ఖండించారు.
​కేసీఆర్‌‌కు దళితులపై ప్రేమలేదు : కడియం
బీఆర్‌ఎస్‌‌కు, కేసీఆర్‌‌కు దళితులకు నిజంగా ప్రేమలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చే రిజర్వేషన్లను అమలు చేయాలి కాబట్టే దళితులు, గిరిజనులకు గౌరవం ఇస్తున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -