Tuesday, September 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతొలి రోజే దుమారం

తొలి రోజే దుమారం

- Advertisement -

స్పీక‌ర్‌పై ఎమ్మెల్సీ తాతా మ‌ధు అనుచిత వ్యాఖ్యలు
ముక్త‌కంఠంతో ఖండించిన శాస‌న‌స‌భ
మ‌ధు స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల్సిందే : సీఎం, స్పీక‌ర్‌, మండ‌లి చైర్మెన్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిర్యాదు
స‌భ్య స‌మాజానికే అవ‌మాన‌కరం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ నిర‌స‌న‌లు
న‌ల్ల‌చొక్కాల‌తో స‌భ‌కు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అడ్డుకున్న పోలీసులు.. నేత‌ల వాగ్వాదం
కేటీఆర్‌, హ‌రీశ్‌రావు స‌హా ప‌లువురి అరెస్టు
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్

అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల తొలిరోజే స‌భ భ‌గ్గుమంది. న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి స‌భ‌కు హాజ‌రయ్యేం దుకు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో మొద‌లైన ఉద్రిక్త ప‌రిస్థితి… అసెంబ్లీ వాయిదా ప‌డే వ‌ర‌కూ కొన‌సాగింది. ఈ క్ర‌మంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మ‌ధు… ఉద్రేకంగా మాట్లాడు తూ స్పీక‌ర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టంతో ఇటు శాస‌న‌స‌భ లోప‌ల‌, బ‌య‌టా ప‌రిస్థితి హీటెక్కింది. ద‌ళితుడైన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌పై దుర్భాష‌లాడిన మ‌ధును త‌క్ష‌ణ‌మే మండ‌లి నుంచి స‌స్పెండ్ చేయాలంటూ అధికార కాంగ్రెస్ ప‌ట్టుబ‌ట్టింది. ఇది మొత్తం స‌భ్య స‌మాజానికే అవ‌మాన‌క‌ర‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌తోపాటు మంత్రులు శ్రీధ‌ర్‌బాబు, పొన్నం ప్రభాక‌ర్‌, సీత‌క్క‌, అడ్లూరి ల‌క్ష్మ‌న్ కుమార్‌, జూప‌ల్లి కృష్ణారావు, వివేక్ వెంక‌ట‌ స్వామితోపాటు బీజేపీ, ఎంఐఎం స‌భ్యులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒకానొక ద‌శ‌లో సీత‌క్క భావోద్వేగానికి గురికాగా.. స్పీక‌ర్ కంట‌త‌డిపెట్టారు. తొలుత సోమ‌వారం ఉద‌యం స‌భ ప్రారంభానికి ముందు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హ‌రీశ్‌రావు స‌హా మిగ‌తా స‌భ్యులంద‌రూ గ‌న్ పార్కు వ‌ద్ద అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పిం చారు. న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించిన వారంద‌రూ అసెంబ్లీ ప్ర‌ధాన ద్వారం నుంచి లోప‌లికి వెళ్లేందుకు ఉద్యుక్తుల‌ య్యారు. వారు ధ‌రించిన టీ ష‌ర్టుల‌పై ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌న్నింటినీ అమ‌లు చేయాల‌ని అని రాసుంది. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన పోలీసులు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకోవ‌టంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. కేటీఆర్‌, హ‌రీశ్‌రావు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. ఈ ద‌శ‌లో తాతా మ‌ధు… స్పీక‌ర్‌ను ఉద్దేశించి నోరు జార‌టంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. సీసీ కెమెరాల్లో దృశ్యాల‌తోపాటు వాయిస్ కూడా రికార్డు కావ‌టంతో… ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఇదే అంశాన్ని స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. మ‌ధు లాంటి వారిపై ఇప్పుడు వేటు వేయ‌క‌పోతే… భ‌విష్య‌త్తు క్ష‌మించ‌బోద‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు మ‌ధు శాస‌న‌మండ‌లి స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… సీఎం రేవంత్ రెడ్డికి, మండ‌లి చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను ప‌రామ‌ర్శించి, సంఘీభావం తెలిపారు. కాగా అసెంబ్లీ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద త‌మప‌ట్ల ప్ర‌భుత్వం, పోలీసులు అనుస‌రించిన తీరుపై బీఆర్ ఎస్‌… రాష్ట్ర‌వ్యాప్త నిర‌స‌న‌లకు పిలుపునిచ్చింది. మంగ‌ళ‌వారం ఆ మేర‌కు అన్ని జిల్లాల్లో కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. మ‌రోవైపు గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ శ్రేణులు తాతా మ‌ధు దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశాయి. మొత్తం మీద వ‌ర్షాకాల స‌మావేశాల తొలిరోజు శాస‌న‌స‌భ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు పూర్తిగా ప‌క్క‌కుపోయాయి. మ‌రి రెండో రోజైన మంగ‌ళ‌వారమైనా స‌భ స‌జావుగా సాగుతుందా? లేక ఇదే అంశాల‌పై మ‌ళ్లీ ర‌గ‌డ మొద‌ల‌వుతుందా? అనేది వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -