అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ఎమ్మెల్యేల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం, తోపులాట
కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నినాదాలు రాసిన నల్ల టీషర్టులు ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోగా.. వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేతలు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే టీషర్ట్ విప్పి లోపలికి వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు పలువురు నేతలు టీషర్టులు తీసేశారు. బనియన్ పైనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర గందరళగోళం నెలకొంది. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ప్రజాప్రతినిధులను అరెస్టు చేశారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాటలో హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డి కింద పడిపోయారు. కేటీఆర్ తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో వారికి గాయాలయ్యాయని తెలిసింది. అరెస్టు అనంతరం నేతలను తెలంగాణ భవన్‌కు తరలించారు.
ఇదిలావుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అలాగే, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని నెట్టారంటూ ఆరోపించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. మహిళా ఎమ్మెల్యే చీర లాగిన అంశంపై పోలీస్ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీషర్ట్లు వేసుకురావడం నేరం కాదని, అయితే వాటిపైన అభ్యంతకర పదాలు ఉండటంతో లోపలికి అనుమతించలేదని వివరించారు. తాము ఎవ్రితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే వీడియోలు చూసి పరిశీలిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఆరోపణలను పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్ సూచన మేరకు తాము నడుచుకుంటున్నట్టు డీసీపీ చెప్పారు.
అడ్డగోలు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ : కేటీఆర్, హరీశ్‌రావు
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, సబండ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చారని తెలిపారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా సభలో అవమానించినా ప్రజల కోసం హామీల అమలుపై ప్రశ్నించాలని తమ అధినేత సూచించినట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలు కొత్త కాదని, గతంలో ఎన్నో చూశామన్నారు. 22 ఏ ద్వారా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధిస్తారని హెచ్చరించారు సీఎం, మంత్రుల బంధువులకు అక్రమంగా భూ కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.
నల్లదుస్తులతో బీఆర్ఎస్ నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



