టెస్టు జట్టులో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు
నవతెలంగాణ-ముంబయి
33 ఏండ్ల మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇటీవల శ్రీలంక-ఏతో రెడ్‌బాల్ ఫార్మాట్‌లో ఆరు వికెట్లతో పాటు అజేయంగా 70 పరుగులు చేసిన సరాన్షు జైన్ సెలక్షన్ కమిటీతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిలో పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవటం, శ్రీలంక జట్టులో లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్లు అధికంగా ఉండటంతో అజిత్ అగార్కర్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సరాన్షు జైన్‌ను ఎంపిక చేసింది. ఫస్ల్ క్లాస్ క్రికెట్‌లో 54 మ్యాచ్‌ల్లో 2223 పరుగులు (సగటు 31.75), 188 వికెట్లు (సగటు 27.30)తో ఆకర్షణీయ గణాంకాలు సరాన్షు జైన్ సొంతం. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం జట్టును ప్రకటించింది. ఇటీవల విదేశీ పర్యటనల్లో భారత జట్టు తడబడుతున్న నేపథ్యంలో శ్రీలంకలో టీమ్ ఇండియా ఓ టూర్ గేమ్ ఆడనుంది. కొలంబోలో ఆగస్టు 7 నుంచి 10 వరకు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉండగా, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
ఊహించినట్టుగానే..!
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ఎంపిక అంచనాలను అనుగుణంగానే జరిగింది. సరాన్షు జైన్‌ను తీసుకుంటారనే అంచనాలు ముందు నుంచీ ఉండగా.. ఇతర ఆటగాళ్ల అంశంలో ఎటువంటి ఆశ్చర్యాలకు తావులేకుండా ఎంపిక సాగింది. బ్యాటింగ్ లైనప్‌లో యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. కెఎల్ రాహుల్ ఓపెనర్ కోటాలో జట్టులో నిలిచాడు. మోచేతి గాయం నుంచి కోలుకున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి రాగా.. ఆల్‌రౌండర్ల కోటాలో సరాన్షు జైన్ సైతం ఎంపికయ్యాడు. మానవ్ సుథర్, కుల్‌దీప్ యాదవ్‌లు స్పిన్నర్లుగా జట్టులో చోటు నిలుపుకున్నారు. జశ్‌ప్రీత్ బుమ్రాకు తోడుగా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అన్‌క్యాప్‌డ్ గుర్నూర్ బరార్‌లు పేసర్లుగా ఎంపికయ్యారు.
ఆ ఇద్దరు ఫిట్‌నెస్ సాధిస్తేనే!
కెరీర్ భీకర ఫామ్‌లో సాయి సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు శ్రీలంక-ఏతో రెడ్‌బాల్ సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక-ఏపై సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ లైనప్‌లో నం.3 బ్యాటర్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గాయంతో బాధపడుతున్న సాయి సుదర్శన్ తుది ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టుతో పాటు శ్రీలంక బయల్దేరనున్నాడు. సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ సాధించకుంటే.. దేవదత్ పడిక్కల్ నం.3 స్థానంలో ఆడనున్నాడు. బౌలింగ్ విభాగంలో పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా సైతం జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో బుమ్రా ఎడమ కాలు మోకాలుకు ఇంపాక్ట్ ఇంజూరీ అయ్యింది. తొలి టెస్టు నాటికి బుమ్రా ఫిట్‌నెస్ చాటుకోవాల్సి ఉంది.
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సరాన్షు జైన్, మానవ్ సుథర్, కుల్‌దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బరార్. (సాయి సుదర్శన్, జశ్‌ప్రీత్ బుమ్రా ఎంపిక తుది ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుంది).
భారత్, శ్రీలంక టెస్టు షెడ్యూల్
ఆగస్టు 7-10 : టూర్ గేమ్ (కొలంబో)
15-19 : తొలి టెస్టు (గాలె)
23-27 : రెండో టెస్టు (కొలంబో)



