ప్రీ క్వార్టర్స్‌లో ఓడిన స్టార్ ఆటగాళ్లు
జెస్సికా పెగులా, ఎమ్మా నవారో ముందంజ
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2026
న్యూయార్క్ (యుఎస్ఏ)
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టైటిల్ రేసు నుంచి నిష్క్రమించారు. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ , టాప్ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు ఓ వైపు దూసుకెళ్తుండగా.. గ్రీసు ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్, డానిల్ మెద్వదేవ్‌లు క్వార్టర్‌ఫైనల్‌కు ముందే ఇంటిముఖం పట్టారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లో ఏడో సీడ్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) 6-7(1-7), 4-6, 6-7(6-8) అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫె చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండు సెట్లను టైబ్రేకర్‌లో కోల్పోయిన మెద్వదేవ్.. ఓ సెట్లో ఆశించిన పోటీ ఇవ్వలేదు. 14 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లు సాధించినా.. విలువైన టైబ్రేకర్‌లో నిరాశపరిచాడు. ఫ్రాన్సెస్ టియాఫె 4 ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో పాటు కీలక టైబ్రేకర్‌లో పైచేయి సాధించాడు. పాయింట్ల పరంగా 119-110తో ఫ్రాన్సెస్ ముందంజలో నిలిచాడు. గేముల పరంగా 16-20తో మెద్వదేవ్ అంచనాలను అందుకోలేదు. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ వరుస సెట్లలో ఓటమి చెందాడు. 2-6, 3-6, 4-6తో బెన్ షెల్టన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 12 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో బెన్ షెల్టన్ రెచ్చిపోయాడు. పాయింట్ల పరంగా 84-58తో, గేముల పరంగా 18-9తో తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. సిట్సిపాస్ ప్రీ క్వార్టర్స్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 7-6(8-6), 6-4, 6-4తో థామస్ మార్టిన్ (అర్జెంటీనా)పై గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్, యంగ్ స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కరాస్ అదరగొట్టాడు. రీ ఎంట్రీలో అదరగొడుతున్న అల్కరాస్ 6-4, 6-3, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించాడు. 20వ సీడ్ అమెరికా ఆటగాడు టామీ పాల్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. 3 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లతో అల్కరాస్ మెప్పించాడు. పాయింట్ల పరంగా 99-79, గేముల పరంగా 18-11తో పైచేయి నిలుపుకున్నాడు. టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-2, 7-6(7-2), 6-2తో తబిలోపై గెలుపొందాడు. 10 ఏస్‌లు, ఆరు బ్రేక్ పాయింట్లతో జ్వెరెవ్ జోరు చూపించాడు.
పెగులా ముందంజ :
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, టైటిల్ ఫేవరేట్ అరినా సబలెంక (బెలారస్) ఇప్పటికే క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించగా.. మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా), ఎమ్మా నవారో (అమెరికా) అదే బాటలో నడిచారు. 16వ సీడ్ సొరానాపై 6-3, 6-4తో జెస్సికా పెగులా వరుస సెట్లలో విజయం సాధించింది. 5 ఏస్‌లు, ఏడు బ్రేక్ పాయింట్లతో పెగులా తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఎమ్మా నవారో 6-4, 6-2తో అనా (రష్యా)పై వరుస సెట్లలో విజయం సాధించింది. ఆరో సీడ్ చెక్ రిపబ్లిక్ అమ్మాయి లిండా 7-5, 5-7, 6-4తో మార్టాపై మూడు సెట్ల మ్యాచ్‌లో పైచేయి సాధించి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.
సిట్సిపాస్, మెద్వదేవ్ ఔట్
- Advertisement -
- Advertisement -



