ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ 385/4
దులీప్ ట్రోఫీ ఫైనల్
నవతెలంగాణ-చెన్నై
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ దూసుకుపోతోంది. అచ్చొచ్చిన చెపాక్ స్టేడియంలో తొలి రోజు పరుగుల వరద పారించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (111 నాటౌట్, 135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (72, 86 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ మోహన్ (85, 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కుమార్ కుశాగ్ర (63 నాటౌట్, 75 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో తొలి రోజు ఆటలో ఈస్ట్ జోన్ 4 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌత్ జోన్ పేసర్ సివి మిలింద్ (2/56) రెండు వికెట్లు పడగొట్టాడు.
బ్యాటర్లు మెరువగా
తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ దూకుడు మంత్ర పఠించింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44, 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 14.4 ఓవర్లలోనే వంద పరుగులు జోడించారు. వైభవ్ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో సౌత్ జోన్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అర్థ సెంచరీకి చేరువైన వైభవ్‌ను హైదరాబాద్ పేసర్ సివి మిలింద్ అవుట్ చేశాడు. దీంతో సౌత్ జోన్‌కు తొలి బ్రేక్ లభించింది. నం.3 బ్యాటర్ శిఖర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. దీంతో ఈస్ట్ జోన్ భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. వేగంగా పరుగులు చేసిన బ్యాటర్లు సౌత్ జోన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఈస్ట్ జోన్ బ్యాటర్లలో సుదీప్ కుమార్ (6) ఒక్కడే నిరాశపరిచాడు. అర్థ సెంచరీల అనంతరం అభిమన్యు ఈశ్వరన్, శిఖర్ మోహన్‌లు అవుటైనా.. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుశాగ్ర (63 నాటౌట్)లు ఐదో వికెట్‌కు అజేయ భాగస్వామ్యంతో దండయాత్ర చేస్తున్నారు. ఏడు ఫోర్లతో 71 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్.. 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 122 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. కుమార్ కుశాగ్ర 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేశాడు. తొలి రోజు ఆటలో 79 ఓవర్లలో 4.87 రన్‌రేట్‌తో పరుగుల మోత మోగించిన ఈస్ట్ జోన్ రెండో రోజు రికార్డు స్కోరుపై కన్నేసింది. సౌత్ జోన్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ గోపాల్, నిదీశ్ నిరాశపరిచారు.



