Monday, September 7, 2026
E-PAPER
Homeఆటలుప్రీ క్వార్టర్స్‌లో గాఫ్‌

ప్రీ క్వార్టర్స్‌లో గాఫ్‌

- Advertisement -

ఒసాక, రిబకినా సైతం ముందంజ
యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2026

న్యూయార్క్‌ (యుఎస్‌ఏ)
యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఆసక్తికరంగా మారుతోంది. టైటిల్‌ రేసులో నిలిచిన అగ్రశ్రేణి షట్లర్లు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ తలుపు తట్టడంతో పోటీ రసవత్తరం కానుంది. మాజీ చాంపియన్‌, అమెరికా అమ్మాయి కొకొ గాఫ్‌ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ క్రీడాకారిణి క్రిస్టినా బుసాపై గాఫ్‌ వరుస సెట్లలో విజయం సాధించింది. 6-3, 6-4తో బుసాపై దండెత్తిన గాఫ్‌ ఓ ఏస్‌, నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 72-54తో పైచేయి సాధించి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి కాలుమోపింది. ఆసియా స్టార్‌, జపాన్‌ క్రీడాకారిణి నవొమి ఒసాక సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకుంది. మానసిక ఒత్తిడితో కొంతకాలం ఆటకు దూరమైన ఒసాక రీ ఎంట్రీలో యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో ఎలిసె మార్టెన్స్‌పై 6-3, 3-6 7-5తో నవొమి ఒసాక మెరుపు విజయం సాధించింది. 9 ఏస్‌లు కొట్టిన ఒసాక..నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 45-43, గేముల పరంగా 16-14తో పైచేయి నిలుపుకుంది.

రెండో సీడ్‌ ఎలెనా రిబకినా ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అదరగొట్టింది. రష్యా అమ్మాయి యులియా పై తొలి సెట్‌ను 7-6(8-6)తో టైబ్రేకర్‌లో సాధించిన రిబకినా.. రెండో సెట్‌ను 6-3తో అలవోకగా సొంతం చేసుకుంది. 12 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లతో రాణించిన రిబకినా.. పాయింట్ల పరంగా 41-18, గేముల పరంగా 13-9తో ఆధిపత్యం చూపించింది. అమెరికా ప్లేయర్‌, 14వ సీడ్‌ ఇవా జోవిక్‌ 7-5, 3-6, 7-5తో అలెగ్జాండ్రపై మూడు సెట్ల హోరాహోరీ పోరులో పైచేయి సాధించి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. స్టార్‌ ప్లేయర్ ఇగా స్వైటెక్‌ సైతం 7-6(7-3), 7-6(7-3)తో వరుస సెట్లలో విజయం సాధించి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో జర్మనీ ఆటగాడు, టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రీ క్వార్టర్స్‌లో కాలుపెట్టాడు. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 6-2, 7-6(7-2), 6-2తో అలెజాండ్రో తబిలోపై జ్వెరెవ్ గెలుపొందాడు. మూడు సెట్లలోనే ముగిసిన మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 10 ఏస్‌లు కొట్టాడు, ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో సాధించిన జ్వెరెవ్‌.. పాయింట్ల పరంగా 106-80, గేముల పరంగా 19-10తో ఆధిపత్యం చూపించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -