Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మోసగాళ్ల అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మోసగాళ్ల అరెస్ట్

- Advertisement -

– రామారెడ్డి పోలీసుల చాకచక్యంతో ఇద్దరు నిందితుల అరెస్ట్
– రూ.15 వేల నగదు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైళ్లు స్వాధీనం 
– సైబ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి 
– ప్రజలు అత్యాశకు పోవద్దు, ఎస్పీ యం. రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు, పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు.

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు నిర్వహించి కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అరెస్టయిన నిందితులు భూక్యా నవీన్ @ నరేష్ (26), భూక్యా ప్రవీణ్ (23) రామారెడ్డి మండలానికి చెందిన వారని చెప్పారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో పనిచేసే సమయంలో Future9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు సేకరించి, భారత్‌కు వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా లింకులు పంపిస్తూ “పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి” అని నమ్మించి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి, యూపీఐ (క్యూఆర్ కోడ్) ద్వారా నగదు స్వీకరించి వెబ్‌సైట్‌లో జమ చేసేవారని, ఇందుకు ఐదు శాతం కమిషన్ పొందినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.15 వేల నగదు, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న నేరాల్లో దాదాపు 20 శాతం సైబర్ క్రైమ్‌లే ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 7,633 మంది ఈ బెట్టింగ్ యాప్‌కు బలైనట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు. గత 22 నెలలుగా రామారెడ్డి మండల కేంద్రంగా అన్నదమ్ములు, ఇంకో వ్యక్తితో  కలిసి ఈ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

ప్రజలు అత్యాశకు పోకుండా, తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయనే నమ్మకంతో ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా చదువుకున్నవారు, ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల్లో ఎక్కువ నగదు ఉండటం వల్లే సైబర్ నేరగాళ్లకు ఎక్కువగా బలవుతున్నారని తెలిపారు. పరిచయం లేని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని హెచ్చరించారు.

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేయాలని, ఆలస్యం చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు.  సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్,  సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -