చైనాలో పత్తా లేకుండా పోయిన వోక్స్‌వ్యాగన్ ‘ఎగిరే కారు’ ప్రాజెక్ట్
దేశీయ కంపెనీల దూకుడును
తట్టుకోలేక చేతులెత్తేసిన వైనం
వెనక్కి లాగిన సాంకేతిక సమస్యలు, చట్టపరమైన వివాదాలు
బీజింగ్ : చైనాలో అభివృద్ధి చెందుతున్న ‘ఎగిరే కారు’ (ఫ్లయింగ్ కార్) మార్కెట్‌లోకి ప్రవేశించాలని వోక్స్‌వ్యాగన్ కంపెనీ అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాంకేతిక పరమైన ఎదురు దెబ్బలు, చట్టపరమైన వివాదాలు, దేశీయ తయారీదారుల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ దీనికి కారణం. వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా మొబిలిటీ రంగానికి అనుగుణంగా వ్యవహరించడంలో విదేశీ ఆటోమొబైల్ తయారీదారులకు సవాళ్లు పెరుగుతున్నాయని వోక్స్‌వ్యాగన్ ఉదంతం నిరూపిస్తోంది.
ప్రత్యేకతలు ఇవే
సంప్రదాయ వాహనాలకు భిన్నంగా విస్తరించడానికి, భవిష్యత్తులో పట్టణ వైమానిక రంగంలో తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీదారు వోక్స్‌వ్యాగన్ 2019లో ‘ఎగిరే కారు’ ప్రాజెక్టును ప్రారంభించింది. రద్డీగా ఉండే రోడ్డు ప్రయాణానికి వేగవంతమైన ప్రత్యామ్నాయాలను కోరుకునే సంపన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని చైనాలోని ప్రధాన నగరాల మధ్య నడిచే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీఎలఓటీ) విమానాన్ని అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. తక్కువ దూరం ఉన్న నగరాల మధ్య ప్రయాణించగల నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి వోక్స్‌వ్యాగన్ బీజింగ్‌లో ఓ ప్రత్యేక పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసింది. సంప్రదాయ హెలికాప్టర్లతో పోలిస్తే ఇది నిశ్శబ్దంగా నడుస్తుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీల సాయంతో దీనిని నడుపుతారు. ఇది పర్యావరణానికి ఎంతో అనుకూలమైనది.
సాంకేతిక అడ్డంకులు
వేగంగా విస్తరిస్తున్న పట్టణ జనాభా, పెరుగుతున్న సంపద, అధునాతన రవాణా సాంకేతికతలకు ప్రభుత్వ మద్దతు వంటి అంశాల కారణంగా చైనాను ఆదర్శవంతమైన మార్కెట్‌గా పరిగణించారు. ఫ్లయింగ్ కార్ల వ్యాపారం ఓ కొత్త మొబిలిటీ విభాగాన్ని సృష్టిస్తుందని, భవిష్యత్తులో వోక్స్‌వ్యాగన్ సంప్రదాయ ఆటోమోటివ్ కార్యకలాపాలకు ఇది భిన్నంగా నిలుస్తుందని అధికారులు భావించారు. అయితే సాంకేతికంగా ఎదురైన సమస్యలు ప్రాజెక్టు అమలును అడ్డుకున్నాయి. వోక్స్‌వ్యాగన్ తొలుత చైనా స్టార్టప్ కంపెనీ పాంటుయో ఏవియేషన్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అయితే విమానం ఏరో డైనమిక్ డిజైన్, సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ దిశపై విభేదాలు తలెత్తడంతో భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వోక్స్‌వ్యాగన్ సంస్థ హునాన్ సన్‌వార్డ్ టెక్నాలజీని సంప్రదించింది. అది అప్పటికే కొన్ని పూర్తి స్థాయి నమూనాలను ఉత్పత్తి చేసింది. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ కంపెనీల నుంచి వచ్చే పోటీని ఈ విమానం వాణిజ్యపరంగా తట్టుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
విదేశీ కంపెనీలకు గుణపాఠం
చైనా ఆటోమోటివ్- టెక్నాలజీ పరిశ్రమలో జరుగుతున్న విస్తృత పరివర్తనకు వోక్స్‌వ్యాగన్ వైఫల్యం అద్దం పట్టింది. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చైనా దేశీయ కంపెనీలు ఎంతగా పోటీతత్వాన్ని పెంచుకుంటున్నాయో, అదే సమయంలో మార్కెట్‌కు అనుగుణంగా మారడానికి పెరుగుతున్న ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నాయో ఈ ఉదంతం నిరూపిస్తోంది. చైనా భవిష్యత్ మొబిలిటీ రంగంలో విజయం సాధించాలంటే కేవలం ప్రపంచ బ్రాండ్ గుర్తింపు ఉంటే సరిపోదని గుర్తు చేసింది. సాంకేతిక నాయకత్వం, బలమైన స్థానిక భాగస్వామ్యాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ ఆవిష్కరణలతో పోటీ పడగల సామర్ధ్యం పైనే విదేశీ సంస్థల విజయం ఆధారపడి ఉంటుంది.
చట్టపరమైన వివాదాలు
తమ భాగస్వామ్యం ముగిసిన తర్వాత వోక్స్‌వ్యాగన్ సంస్థ మరో చైనా ఏవియేషన్ కంపెనీతో రహస్య సాంకేతిక సమాచారాన్ని అక్రమంగా పంచుకున్నదని పాంటుయో ఏవియేషన్ ఆరోపించింది. ఈ వివాదం తొలుత మధ్యవర్తుల వద్దకు, ఆ తర్వాత సివిల్ – క్రిమినల్ వ్యాజ్యాల వరకూ వెళ్లింది. తనపై వచ్చిన ఆరోపణలను వోక్స్‌వ్యాగన్ ఖండించినప్పటికీ ప్రాజెక్ట్ రద్దుతో సంబంధం లేకుండా దర్యాప్తులు కొన సాగుతున్నాయి.
దూసుకుపోతున్న దేశీయ పరిశ్రమ
ఓ వైపు వోక్స్‌వ్యాగన్ ఇబ్బందులు పడుతుంటే మరోవైపు తక్కువ ఎత్తులో ఎగిరే ఫ్లయింగ్ కార్ల దేశీయ పరిశ్రమ అభివృద్ధిలో దూసుకుపోయింది. డ్రోన్లు, ఎయిర్ ట్యాక్సీల తయారీలో పెట్టుబడులను ఈ పరిశ్రమ ప్రోత్సహించింది. దేశీయ తయారీ దారులు పరిశోధనలు, పరీక్షలు, వాణిజ్య విస్తరణను వేగవంతం చేశారు. దీంతో దేశీయ కంపెనీలు అంతర్జాతీయ పోటీదారులను దాటుకొని ముందుకుపోయాయి. అనేక చైనా కంపెనీలు ఆధునిక పరీక్షా దశలలో ప్రవేశించి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధపడితే వోక్స్‌వ్యాగన్ మాత్రం నమూనా అభివృద్ధికే పరిమితమైంది. చివరికి 2024 జూన్‌లో వోక్స్‌వ్యాగన్ ఫ్లయింగ్ కార్ల ప్రాజెక్ట్ రద్దయింది. చైనాలో వేగవంతమైన ఆవిష్కరణలు, పోటీ ధరలు, బలమైన డిజిటల్ సామర్ధ్యాల ద్వారా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు క్రమంగా మార్కెట్ వాటాను పెంచుకుంటుండగా తమ వాహన అమ్మకాలు పడిపోతుండడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.



