Wednesday, March 25, 2026
E-PAPER
Homeమానవిపుచ్చ‌కాయ‌తో అదిరే రుచులు..

పుచ్చ‌కాయ‌తో అదిరే రుచులు..

- Advertisement -

వేసవికాలంలో చలువ కోసం పుచ్చకాయను తింటాం. నిజానికి ఈ పండుని ఇష్టపడని వారంటూ ఉండరూ. కాయ లోపటి ఎర్రటి గుజ్జు ఎంతో తియ్యగా ఉంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. ఈ పుచ్చకాయలతో ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. దాంతోపాటు అది తిన్నాక మిగిలిన పైతొక్కతో కూడా కొన్ని వంటలు చేసుకోవచ్చు. దీని వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. మరి అలాంటి పుచ్చకాయ వంటకాల గురించి తెలుసుకుందాం…

పుచ్చకాయ హల్వా
కావలసిన పదార్థాలు : పుచ్చకాయపై తొక్క భాగం – ఒక కాయది, నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు, బొంబాయిరవ్వ – టేబుల్‌ స్పూను, శనగపిండి-టేబుల్‌ స్పూను, పంచదార- అరకప్పు, దాల్చిన చెక్క పౌడర్‌ – అర టేబుల్‌ స్పూను, జాజికాయ పౌడర్‌ – చిటికెడు, పాలు – కప్పు, బాదం – పిడికెడు
తయారుచేసే విధానం: పుచ్చకాయను తిన్నాక పైన మిగిలే ఆకుపచ్చ ముక్కలు తీసుకోండి. వాటి చివర్లను, పైన పచ్చగా కనిపించే భాగాన్ని చాకుతో తొలగించండి. లోపల తెల్లటి భాగం మాత్రమే మిగిలి ఉంటుంది. దాన్ని చిన్న ముక్కలుగా కట్‌ చేసి గ్రైండర్‌లో వేసి మెత్తటి గుజ్జుగా చేయండి. కడాయిలో నెయ్యి వేసి వేడిచేయండి. బొంబాయిరవ్వ, సెనగపిండి వేసి కలుపుతూ గోధుమరంగులోకి మారేదాక సన్నమంట మీద వేడిచేయండి. గ్రైండ్‌ చేసుకున్న గుజ్జును ఇందులో వేసి, పెద్ద మంట మీద నీరంతా ఆవిరైపోయేదాకా ఉడికించాలి. దీనికి పంచదార, దాల్చిన చెక్క, జాజికాయ పౌడర్‌లు వేసుకోవాలి. తర్వాత పాలు పోసి, బాదం, పిస్తా పప్పులు వేసుకోని ఒక పాత్రలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అంతే నోరూరించే పుచ్చకాయ హల్వా రెడీ.

తొక్కల ఇగురు
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ తెల్లటి తొక్కలు: రెండు కప్పులు (పై ఆకుపచ్చ తొక్క తీసేసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి), పోపు దినుసులు – ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు- తగినన్ని, ఉల్లిగడ్డ – ఒకటి (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి – రెండు మూడు, కరివేపాకు – కొద్దిగా, కారం – స్పూను, పసుపు: అర స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు స్పూన్లు, కొత్తిమీర – కొద్దిగా.
తయారీ విధానం: పుచ్చకాయలోని ఎర్రటి గుజ్జు తినేసాక, పైన ఉండే గట్టి ఆకుపచ్చ తొక్కను చెక్కేయాలి. లోపల తెల్లగా ఉండే భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న పుచ్చకాయ తొక్క ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. పసుపు, కొద్దిగా ఉప్పు వేసి, మూత పెట్టి తక్కువ మంట మీద ముక్కలు మెత్తబడే వరకు మగ్గించాలి. ముక్కలు ఉడికిన తర్వాత కారం, కొబ్బరి తురుము లేదా వేరుశనగ పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్‌ ఆపేయాలి. ఈ ఇగురు వేడి అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.

ఐస్‌క్రీమ్‌
కావల్సిన పదార్థాలు: తరిగిన పుచ్చకాయ ముక్కలు – మూడు కప్పులు, చక్కెర – కప్పు, చిక్కటి క్రీమ్‌ – కప్పు, కండెన్స్డ్‌ మిల్క్‌ – కప్పు, నిమ్మరసం – టేబుల్‌ స్పూను, ఉప్పు – చిటికెడు(రుచికోసం)
తయారు చేసే విధానం: పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి అందులో విత్తనాలను పూర్తిగా తీసివేయాలి. తర్వాత గిన్నెలో కాని ఫుడ్‌ ప్రాసెసర్‌లో కానీ వేసి గుజ్జుగా తయారు చేయాలి. తర్వాత ఈ గుజ్జును వడకట్టి అందులో నిమ్మరసం బాగా కలపండి. తర్వాత మరో పెద్ద గిన్నెలోకి ఈ రసాన్ని తీసుకొని అందులో చిక్కటి క్రీమ్‌ కలిపి నురుగు వచ్చే వరకు బాగా గిలక్కొట్టండి. తర్వాత ఇందులో కండెన్స్డ్‌ మిల్క్‌ వేసి బాగా కలపండి. ఇప్పుడు పుచ్చకాయ గుజ్జును ఇందులో వేసి బాగా కలియపెట్టి ఉప్పు, పంచదార వేసి అన్ని పదార్థాలు కలపండి. తర్వాత ఆ గిన్నెకు మూత పెట్టి రెండు గంటలు డీఫ్రిజ్‌లో పెట్టండి. రాత్రంతా పెడితే ఇంకా మంచిది. తర్వాత ఇలా గట్టిపడిన తర్వాత వాటిని కప్పుల్లో సర్క్‌ చేసుకోండి. అంతే పుచ్చకాయ ఐస్‌ క్రీం రెడీ.

పుచ్చకాయ జ్యూస్‌
కావాల్సిన పదార్థాలు : పుచ్చకాయ – ఒకటి, బాదం – పది, జీడిపప్పు పలుకులు – పది, సబ్జా గింజలు – రెండు టేబుల్‌ స్పూన్లు, కాచి చల్లార్చిన పాలు – మూడు కప్పులు, రోజ్‌ సిరప్‌ – నాలుగు టీ స్పూన్లు
తయారీ విధానం : ఓ చిన్న కప్పులో రెండు టేబుల్‌ స్పూన్ల సబ్జా గింజలు, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. అదేవిధంగా పది బాదం, పది జీడిపప్పు పలుకులను సన్నగా కట్‌ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పుచ్చకాయను తీసుకొని శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత మిక్సీజార్‌లో కట్‌ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ మిక్సింగ్‌ బౌల్లో వేయాలి. ఇందులోనే మూడు కప్పుల కాచి చల్లార్చిన పాలు, నానబెట్టిన సబ్జా గింజలు యాడ్‌ చేయాలి.
అలాగే తరిగి ఉంచిన బాదం, జీడిపప్పు పలుకులు, తీసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆపైన నాలుగు టీ స్పూన్ల రోజ్‌ సిరప్‌ యాడ్‌ చేసి మరోసారి కలపాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్‌ సిద్ధం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -