Wednesday, March 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకిక్కిరిసిన ధర్నాచౌక్‌

కిక్కిరిసిన ధర్నాచౌక్‌

- Advertisement -

గళమెత్తిన బాధితజనం
సీపీఐ ఆధ్వర్యంలో ఇండ్లు,ఇండ్లస్థలాల పోరాటం
సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు ధర్నాలు
ఇందిరాపార్కు, ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో వేలాది మంది పేదలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ధర్నాచౌక్‌. బాధిత జనం, కార్మిక లోకం తమ సమస్యలను గొంతుకలతో ఎలుగెత్తి పాలకులకు చెప్పే పోరాటాల కేంద్రం. కార్మికులు..రైతులు…ఉద్యోగులు..ఇలా ఎవరికైనా అదొక ఉద్యమ కేంద్రం. బీఆర్‌ఎస్‌ పాలకులు ధర్నాచౌక్‌ను ఎత్తేస్తే.. కమ్యూనిస్టులు, ప్రజా, ఉద్యమ సంఘాలు కోర్టులకెళ్లి మరీ అక్కడ ధర్నాలు చేసుకునే హక్కు సాధించుకున్న ఉద్యమ కేంద్రం. అంతటి ప్రాధాన్యత ఉంది. అలాంటి ఉద్యమ కేంద్రం మంగళవారం మరోమారు బాధిత ప్రజలతో కిక్కిరిసిపోయింది. సీపీఐ ఆధ్వర్యంలో ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం, సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు తలపెట్టిన ధర్నాలకు ప్రజలు వేలాదిగా తరలొచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు డీసీఎంలు, వ్యాన్లలో వచ్చారు. వారంతా మనిషికి ఐదొందలు, వెయ్యి రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చినోల్లు కాదు, బీరుబిర్యానీ కోసం ఆశపడి వచ్చినోళ్లు అస్సలు కాదు. రెక్కల కష్టానికి ప్రతిఫలం దక్కక, నిలువునీడ లేని తమకు ఇండ్లు కట్టించి న్యాయం చేయాలంటూ కడుపుకాలి వచ్చినోళ్లు. వేలాది మంది మున్సిపల్‌ మహిళా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సద్దులు కట్టుకుని మరీ రావడం వెనుక పోరాట పటిమ కనిపించింది. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన పోర్టర్‌ ఆన్‌లైన్‌ బిజెనెస్‌ యాప్‌లో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. అదే సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్లు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాకు పూనుకున్నారు. ఒకే రోజు నాలుగు ధర్నాలతో ధర్నాచౌక్‌ ప్రాంతం మొత్తం బాధిత ప్రజలతో కిక్కిరిసిపోయింది. సర్కారు కూడా పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించింది.

సర్కారు తీరుపై విమర్శలు
అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచీ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ పోలీసులమయంగా మారింది. ‘మాది ప్రజా ప్రభు త్వం…స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు’ అని కాంగ్రెస్‌ పాలకులు పైకి గంభీరంగా చెబుతున్నా…అంగన్వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ కార్మికులను నిర్ధాక్షిణ్యంగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాచౌక్‌లో ‘ గోడు వెళ్లబోసుకుంటాం.. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు వెళ్లేలా ధర్నా చేస్తాం’ అని మొత్తుకున్నా పోలీసులు వారి ధర్నాలకు అనుమతివ్వలేదు. పైగా, అర్ధరాత్రి అరెస్టులు, గృహనిర్బంధాలతో భయానక పరిస్థితులను సృష్టించారు. అయినా, వేలాది మంది అంగన్వాడీలు, గ్రామపంచాయతీ కార్మికులు పోలీసుల పన్నాగాలకు పై ఎత్తులు వేస్తూ ధర్నాచౌక్‌ సమీపంలోకి వేలాదిగా చేరుకున్నారు. రోడ్డుపైనే వందలాది మంది అంగన్వాడీలు ఒక్కసారిగా బైటాయించడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ‘ఇదెలా జరిగింది? ఇంత మంది వచ్చేదాకా ఏం చేస్తున్నారు?’ అంటూ కిందిస్థాయి పోలీసులకు అంక్షితలు వేయడమూ తెలిసిందే. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ కార్మికులు తలపెట్టిన చలో హైదరాబాద్‌ పిలుపులకు అనుమతి ఇవ్వని విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒకింత చెడ్డ పేరు వచ్చిందనే చెప్పాలి. ప్రజా, కార్మిక, రైతుల పోరాటాల విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలకులకు పెద్దగా తేడా ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్‌ సర్కారు కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తమ సంఘం తలపెట్టిన ధర్నాలకు అనుమతి ఇవ్వకపోవడం హక్కులను హరించడం కిందకు వస్తుందంటూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయించిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -