కొత్త పాయింట్ల పద్దతిపై పుల్లెల గోపీచంద్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఆధునిక కాలంలో స్పోర్ట్స్ లోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా సర్దుబాటు, మార్పులు చేసుకుంటు ముందుకు వెళ్లాలి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) వచ్చ ఏడాది నుంచి కొత్త పాయింట్ల పద్దతిని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఓ మ్యాచ్లో (సింగిల్స్, డబుల్స్) మూడు గేములు 21 పాయింట్ల చొప్పున జరుగుతున్నాయి. నూతన పద్దతి ప్రకారం మూడు గేములు కొనసాగనుండగా పాయింట్లను 15కు కుదించారు. ఈ పద్దతిపై ఎక్కువగా విమర్శలు వస్తుండగా ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందించారు. 2026 బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్ సీడింగ్ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వ్యూహాత్మక మార్పుకు సిద్ధమైంది. కొత్త పాయింట్ల పద్దతితో కొందరు ఆటగాళ్లు కనుమరుగు కానుండగా.. మరికొందరికి ఇది ఉపయోగపడుతుందని’ గోపీచంద్ అన్నారు. ‘నేను ఆల్ ఇంగ్లాండ్ నెగ్గిన కొన్ని నెలల తర్వాత అప్పటి 15 పాయింట్ల స్కోరును 7 పాయింట్లకు కుదించారు. స్ర్టోక్ ప్లేయర్గా ఆ పద్దతిని అలవాటు పడేందుకు నాకు ఏడాది సమయం పట్టింది. 7 పాయింట్ల స్కోరుకు అలవాటు పడుతుండగానే మళ్లీ 15 పాయింట్లకు పెంచారు. అప్పడు 15 పాయింట్లకు ఆడటం కష్టసాధ్యంగా అనిపించింది. ఈ మార్పు ఆటపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. కొంత మంది ఆటగాళ్లు కనుమరుగు అవుతారు, కొంత మందికి ఉపయోగకరంగా ఉంటుందని’ గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.
ఆ లాజిక్ అర్థం కాలేదు!
‘బిజీ షెడ్యూల్లో ఆటగాళ్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు పాయింట్ల పద్దతిని మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆరు రోజుల్లో ముగిసే టోర్నమెంట్ను రెండు వారాలకు పొడగిస్తున్నారు. ఓ వారంలో ముగిసే టోర్నమెంట్ను మరో వారానికి పొడిగిస్తున్నప్పడు 21 పాయింట్లను కొనసాగించవచ్చు, 15 పాయింట్ల పద్దతి అవసరం లేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఏక కాలంలో పాయింట్లను కుదిస్తూ, టోర్నీ నిడివి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వెనుక తర్కం నాకు అర్థం కాలేదు’ అని గోపీచంద్ అన్నారు.
మోదం.. ఖేదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



