Tuesday, August 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసంక్షోభ న్యాయం!

సంక్షోభ న్యాయం!

- Advertisement -

భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం తర్వాత అత్యంత గౌరవనీయమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయవ్యవస్థ. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రశ్నించేది, పౌరుల హక్కులను కాపాడేది, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేది కోర్టులే. కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ‘కొలీజియం’ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి బహిర్గతం చేశాయి. ప్రజల్ని ‘చీమలు’గా చూసే భావజాలం ఉన్నవారు కూడా న్యాయ మూర్తులవుతున్నారని, నిజాయితీగా పనిచేసినవారికి పదోన్నతులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఆయన మాటలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి. ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత’ అన్న అంశంపై ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులో ఉజ్జల్‌ భుయాన్‌ ప్రసంగించగా, ఆయన చెప్పిన అంశాలు జరుగుతున్న పరిణామాల్ని బలపరిచేలా ఉన్నాయి. భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థను కార్య నిర్వాహక, శాసన వ్యవస్థల నుంచి స్వతంత్రంగా ఉంచింది. కారణమొక్కటే, అధికార దుర్విని యోగం జరిగినప్పుడు ప్రజలకు న్యాయం చేయగల చివరి సంస్థ న్యాయస్థానం కావాలి. కానీ, ఆ సంస్థలోకి ఎవరు వస్తున్నారు? ఏ ప్రమాణాలతో వస్తున్నారు? వారి రాజ్యాంగ నిబద్ధత ఏమిటి? అనే ప్రశ్నలు నేడు మరింత ముందు కొస్తున్నాయి.

ఎందుకంటే, గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వ న్యాయవ్యవస్థపై ప్రభావం చూపాలనే ప్రయత్నాల పట్ల విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కొలీజియం సిఫారసులను ఆలస్యం చేయడం, నియామకాలపై ఒత్తిడి తీసుకురావడం, న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా చేస్తున్నాయి. రెండేండ్ల క్రితం అలహాబాద్‌ ‌హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో పాల్గొనడమే కాకుండా ప్రజల్ని చీమలతో పోల్చడం, ఆ మాటలు ముస్లింలనుద్దేశించి చేశారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థకు, ప్రజాప్రయోజనాలకు అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఒక వర్గానికి అనుకూ లంగా వ్యవహరిస్తున్న తీరు తీర్పుల్లో కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సందర్భం ఎలాంటిదైనా న్యాయ మూర్తి వ్యాఖ్య రాజ్యాంగానికి లోబడి ఉండాలి. కానీ, అది వ్యక్తిగత అభ్రిపా యంగా మారకూడదు. మొన్నటికి మొన్న దేశమంతా చూసింది. ‘బొద్దింకలు’ అనే వ్యాఖ్య దేశ రాజకీయ చర్చల్లో సునామిని సృష్టించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తే ఈ పదాన్ని వాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే యువత సంఘటి తమైంది. ఈ ఐక్యత వెనుక దాగి ఉన్న నిరాశ, ఆవేదన, వ్యవస్థలపై నమ్మకం కోల్పోవడం వంటి అంశాలను విస్మరించలేం. ప్రజాస్వామ్యంలో మాటలను మాత్రమే కాదు, వాటిని పుట్టించిన పరిస్థితులను కూడా విశ్లేషించాలి.

అందుకే జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలలో అత్యంత ముఖ్యమైన అంశం కొలీజియంలో పారదర్శకత. న్యాయమూర్తుల ఎంపిక ఏ ప్రమాణాలపై జరుగుతోంది? రాజ్యాంగంపై నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, సామాజిక స్పృహ వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోవడం వల్లే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో జరిగే చర్చలు పూర్తిగా గోప్యంగా ఉండటంతో పాటు, తీసుకునే నిర్ణయాలకు గల కారణాలను కూడా చాలా సందర్భాల్లో వెల్లడించడం లేదు. ఏ ప్రమాణాల ఆధారంగా నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపడుతున్నారన్నది ప్రజలకు స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల కొలీజియం చేసిన తీర్మానాల్లో నిర్ణయాలకు ఎలాంటి కారణాలను నమోదు చేయకపోవడం పారదర్శకతపై మరిన్ని సందేహాలకు తావి స్తోంది. గతంలో కనీసం కొన్ని కారణాలనైనా వెల్లడించే పద్ధతి ఉండగా, ఇప్పుడు అది కూడా కనిపించకపోవడం ‘అధికార వైఖరి’ని ప్రతిబింబిస్తోంది. ఇంకోవైపు, కొందరు న్యాయమూర్తుల తీరు ఆందోళన కరంగా ఉంది.

బెయిల్ విషయంలో భిన్న ప్రమాణాలు, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో విరుద్ధ వ్యాఖ్యలు, సామాజిక వాస్తవాల పట్ల స్పృహ లేని పరిశీలనలు ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. న్యాయమూర్తి తీర్పు చట్టపరంగానే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి కూడా అనుగుణంగా ఉండాలి. ప్రజల బాధలను అర్థం చేసుకోలేని న్యాయం, న్యాయంగా నిలవదు. భారత న్యాయవ్యవస్థకు గొప్ప చరిత్ర ఉంది. ప్రాథమిక హక్కులను విస్తరించిన తీర్పులు, పౌర స్వేచ్ఛలను రక్షించిన చారిత్రక నిర్ణయాలు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరిచాయి. అదే సమయంలో కొన్ని తీర్పులు, కొన్ని వ్యాఖ్యలు, కొన్ని నియామకాలు ఆ విశ్వాసాన్ని దెబ్బతీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యక్తం చేసిన ఆవేదనను వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా వ్యవస్థకు ఒక హెచ్చరికగా భావించాలి.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -