Thursday, September 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘190’’ జీవోకు ఏడాది..అమలుకు ఎన్నేండ్లు?

‘‘190’’ జీవోకు ఏడాది..అమలుకు ఎన్నేండ్లు?

- Advertisement -

తెలంగాణలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల కేడర్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత ప్రభుత్వం 2021లో జీవో నంబర్‌ 317ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయులను కొత్త స్థానిక కేడర్లకు కేటాయించారు. అయితే ఈ ప్రక్రియలో పలువురు తమ సొంత జిల్లాలకు దూరంగా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు కుటుంబాలకు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు దూరంగా సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికత, స్పౌజ్‌, వైద్యపరమైన సమస్యలు, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్లు అప్పటి నుంచీ వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఆందోళనలు, వినతుల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం 317 జీవో బాధితుల సమస్యలను పరిశీలించింది. కొన్ని కేటగిరీల్లో పరిష్కార చర్యలు చేపట్టినా అందరి సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో 2025 సెప్టెంబర్‌ 16న ప్రభుత్వం జీవో నంబర్‌ 190ను జారీ చేసింది. లాంగ్‌ డిప్యూటేషన్‌ ద్వారా 317 బాధితులకు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. దీంతో తమ కుటుం బాలకు కొంతైనా దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశించారు.అయితే జీవో 190 జారీ అయి ఏడాది పూర్తవుతున్నా దాని అమలు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యా యుల నుంచి దరఖాస్తులు తీసుకుని, అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్‌ కల్పించాలని వారు కోరు తున్నారు.

ప్రక్రియలో జాప్యం లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, అర్హులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో 317 జీవోతో ఏర్పడిన సమస్యకు తాత్కాలిక పరిష్కారంతో పాటు సొంత జిల్లాలకు శాశ్వతంగా తిరిగి వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య అంటే కేవలం జీతాలు, పదోన్నతులకు సంబంధించినది కాదు. కుటుంబానికి దగ్గరగా ఉండటం, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలను నిర్వహించుకోవడం కూడా వారి జీవితంలో కీలకమైన అంశాలే. ముఖ్యమంత్రి పలుమార్లు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఆర్థిక భారం లేని 190 జీవో అమలులోనూ జాప్యం ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న సహజం గానే తలెత్తుతోంది. ఏండ్లుగా 317 జీవో సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవో 190 కనీస ఉపశమనాన్ని కల్పించగలదు. ప్రభుత్వం ఇకనైనా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి లాంగ్‌ డిప్యూటేషన్‌ అవ కాశం కల్పించాలి. 317తో ఏర్పడిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూడా చర్యలు తీసుకోవాలి. జీవోలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాటి ప్రయోజనం బాధితులకు చేరినప్పుడే ప్రభుత్వ హామీలకు అర్థం ఉంటుంది.

సూరంపల్లి శ్రీనివాస్‌, 9666568018

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -