Wednesday, September 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసభా సమయం

సభా సమయం

- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రాజకీయ ఆరోపణలు, విమర్శలకు వేదికగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల పోట్లాటగా నిలుస్తున్నాయి. నాలుగు కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ, ప్రజాసమస్యలను లోతుగా చర్చించడంలో విఫలమవుతున్నది. ప్రజాప్రతినిధులు వ్యక్తిగత పంతాలు, ప్రతిష్టకు పోతుండటంతో జనంగోడును పట్టించుకోవడం కరువైంది. కనీస అసెంబ్లీ నియమాలను పాటించడం లేదు. కేంద్రం సహాయ నిరాకరణకు తోడు రాష్టంలోని అధికార, విపక్షాల మధ్య రాజకీయపోటీతత్వంతో రాష్ట్రాభివృద్ధి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా మార్చేసింది. సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్నార్థకమైంది. ఏ ప్రభుత్వమొచ్చినా స్పీకర్‌ ‌స్థానం ప్రతిసారీ చర్చనీయాంశమవు తున్నది. కమ్యూనిస్టుల ప్రాతినిథ్యం తక్కువగా ఉన్న అసెంబ్లీల్లో సరైనపంథాలో చర్చలు సాగవనడానికి రాష్ట్ర అసెంబ్లీనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. బిల్లుల చర్చాసమ యంలోనూ సభ్యుల సంఖ్య పలుచగా ఉండటం సరికాదు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నా రన్న ఇంగితాన్ని సభ్యులు విస్మరిం చడం బాధాకరం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం, అవసరమైతే సస్పెండ్‌ ‌చేసి బయటకు పంపేయడం ఆనవాయితీ అయింది. పరిణితిని ప్రదర్శించాల్సిన సభ్యులు ఆవేశకావేశాలకులోనై ప్రజాసమస్యలను పాత రేస్తున్నారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మూడు, నాలుగు బిల్లుల చర్చల్లో 119 మంది శాసనసభ్యులకుగాను సగం మంది కూడా పాల్గొనకపోవడం ఆందోళన కలిగించే అంశం. పంచాయతీరాజ్‌ ‌చట్టసవరణ, ప్రజావిశ్వాస చట్ట సవరణ, క్యూర్‌ ‌చట్టం ఈ తరహావే. అసెంబ్లీ ప్రజాస్వామ్యబద్దమైన చర్చకు వేదిక కావాలి తప్ప, అరుపులు, కేకలకు కాదు. కర్నాటకతోపాటు కేరళంలో సైతం అరవై రోజులు అసెంబ్లీ నడుస్తున్నది. సభ సగటున ఏడాదికి 25 నుంచి 30 రోజులు మాత్రమే సమావేశమవుతున్నది. ఏడాదికి కనీసం అరవై రోజులు జరగాలి. గత బడ్జెట్ సమావేశాల్లో మొత్తం పది హేను రోజులకు గాను పదకొండు రోజులు ప్రశ్నోత్తరాలకు సమయమే లేదు. ‘ఆరు గ్యారెంటీల’ వైఫల్యంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తే , కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై అధికారపక్షం నిరసన వ్యక్తం చేసింది. రెండింటి మధ్య సభాసమయం వృధా అయింది. ఇక ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ‌సర్వసాధారణమైంది. సభామర్యాదలు మంటగలుస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు, ఆర్టీసీ విలీనం, ఇందిరమ్మ ఇండ్లు, 22ఏ తదితర అంశాలపై సంపూర్ణ చర్చకు ఆస్కారం ఉండటం లేదు. రైతు భరోసా నిధుల జమ గురించి మాట్లాడే అవకాశం లేకుండాపోయింది. బీఆర్‌ఎస్‌ పాలనలో పదేండ్లపాటు ఒక్క ప్రయివేటు బిల్లునూ అనుమతించలేదు. తాజా సర్కారు హయాంలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రయివేటు బిల్లును ప్రవేశపెడతానని ప్రతిపక్షం ప్రకటించింది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రవేశపెట్టే బిల్లుపై కూడా చర్చ జరగాలి.

అయితే కాంగ్రెస్‌ ‌సర్కారు అందుకు అంగీకరించ లేదు.ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా ప్రయివేటు బిల్లుపై చర్చ చోటుచేసుకుంది. రూ.మూడు లక్షల కోట్ల బడ్జెటును కేవలం రెండు రోజుల్లోనే ఆమోదించారు. ఒక్కోశాఖకు కేవలం పది నిమిషాలే చర్చకు అవకాశం దక్కింది. సభ్యులు సొంత అధ్యయనం చేయకుండా పార్టీలిచ్చిన రాతపూర్వక ప్రసంగాలనే చదువుతున్నారు. కోత తీర్మానాలే లేవు. డిమాండ్లపై వివరణాత్మక చర్చే ఉండటం లేదు. ప్రతిరోజూ మొదటి గంట తప్పనిసరిగా ప్రశ్నోత్తరాలకు కేటాయించాలి, ఎలాంటి అంతరాయాలను అనుమతించ కూడదు. ఒకవేళ అదే జరిగితే ఆమేరకు సభా సమయాన్ని పొడిగించాలి. కేరళం మాదిరిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నేతృత్వంలో సబ్జెక్ట్ కమిటీలు క్షుణ్ణంగా చర్చించిన మీదటే బిల్లులను ఆమోదించాలి.ఆర్టీసీ విలీన బిల్లు ఎలాంటి కమిటీ లేకుండానే ఒక్కరోజులో ఆమోదం పొందడం తెలిసిందే. సభలో గందరగోళ వాతావరణం ఏర్పడి సభ నుంచి సభ్యులను మొత్తం సమావేశ కాలానికి సస్పెండ్ చేయడం ఆపాలి. గత రెండు సమావేశాల్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలను సర్కారు సస్పెండ్ చేసింది. ఆమేరకు ప్రాతినిధ్యం లేకుండా పోవడం ప్రజాస్వామ్యానికి, ఆయా నియోజక వర్గాల అభివృద్ధికి విఘాతమే.అసెంబ్లీ అనేది ప్రభుత్వం నిశ్శబ్దంగా బిల్లులు ఆమోదించుకునే వేదిక ఎంతమాత్రం కానేకాదు. అలాగే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి అసలే కాదు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అర్థవంతమైన, పారదర్శక చర్చ చేసి పరిష్కారాలను చూపించే సభగా మాత్రమే అసెంబ్లీని చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -