Tuesday, September 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబహుళ ధ్రువ ప్రపంచం దిశగా..

బహుళ ధ్రువ ప్రపంచం దిశగా..

- Advertisement -

బహుళ ధ్రువప్రపంచం కోసం బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర మావేశం పిలుపునివ్వడం హర్షణీయం. అగ్రరాజ్యం అమెరికా ఏకపక్ష‍ ఆంక్ష‍లు, యుద్ధాలతో నష్టపోతున్న ప్రపంచానికి ఊరట. సమావేశాల ముందురోజునే ‘స్థిరత్వం, నవకల్పన, సహకారం, సుస్థిరత’ లక్ష్యంగా ఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించడం, సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించడం శుభపరిణామం. న్యూఢిల్లీ వేదికగా సాగిన ఈ సమావేశం ఏకధ్రువ ప్రపంచాన్నీ, డాలర్‌ ఆధిపత్యాన్నీ సవాల్‌ చేయడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకాలం అమెరికా, ఇజ్రాయిల్‌ అడుగులకు మడుగులొత్తి, ఏకపక్ష‍ సుంకాలు, బెదిరింపులపై కనీసం నోరుమెదపని మోడీ ప్రభుత్వం… తాజా డిక్లరేషన్‌లో వాటి పేరెత్తకుండానైనా వాటి చర్యలను ఖండించింది. బహుపాక్ష‍ికవాదం (మల్టీలేటరిలిజమ్‌) ప్రాముఖ్యతను ఈ సమావే శాలు ముందుకు తేవడం మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అద్దం పడుతోంది. 2009లో భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌ దేశాలతో ప్రారంభమైన బ్రిక్స్‌లో ఆ తరువాత దక్ష‍ిణాఫ్రికా చేరింది. ప్రస్తుతం పదకొండు దేశాలతో, ప్రపంచంలో దాదాపు యాభై శాతం జనాభాతో, నలభై శాతం జీడీపీతో ఉన్న ఈ కూటమి ఐక్యత అత్యవసరం. సోవియట్‌ యూనియన్‌ పతనా నంతరం ప్రపంచంపై ఏకపక్ష‍ ఆధిపత్యానికి తెగబడు తున్న అమెరికా దురాక్రమణ వాద, దుశ్చర్యలను అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య యుతమైన, విస్తృత భాగస్వామ్యం కలిగిన అంతర్జాతీయ కూటమి అత్యవసరం.

ఏకధ్రువ ప్రపంచానికి బదులుగా మరింత ప్రజాస్వామ్యయుతమైన ప్రపంచ వ్యవస్థ ఉండాలని ఈ సమావేశం పిలుపునివ్వడం సముచితం. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ప్రజల అభిప్రాయాలను, ప్రయోజనాలను ప్రతిబింబించేలా వ్యవహరించాలన్న సభ్యదేశాల డిమాండ్‌ వాటి వైఖరులను సరిచేసుకోవాలన్న హెచ్చరిక. అమెరికా ఏకపక్ష‍ ఆంక్ష‍ లను, సుంకాలను ఖండిం చడం అగ్రరాజ్యానికి మింగుడుపడనిదే. బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచాలని, స్థానిక కరెన్సీలలో మరింత ఎక్కువ లావాదేవీలు జరపాలని చేసిన తీర్మానం ప్రత్యామ్నాయ కరెన్సీకి ఊపునివ్వడంతోపాటు డాలర్‌ గట్టి సవాల్‌ను విసిరేదే! మనదేశంలో పహల్గామ్‌లో దాడి సహా ఏ దేశంలోనూ ఉగ్రదాడులను సహించబోమన్న తీర్మానం సరైనది. ఏ సభ్య దేశం పేరు, అమెరికా పేరు ప్రస్తావించకపోయినా ఈ డిక్లరేషన్‌ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని గట్టిగానే ప్రశ్నిం చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను ఆయుధాలుగా మలిచే అమెరికా తీరును ఈసడించింది. గాజాలో ఇజ్రాయిల్‌ దాడులను తీవ్రంగా ఖండించడం, 1967 నాటి సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలేం రాజధానిగా స్వేచ్ఛాయుతమైన స్థిరమైన, సార్వభౌమాధికారం కలిగిన పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం ముదావహం.

ఆయుధాల విచ్చలవిడి వినియోగానికి స్వస్తి పలకాలని, సాయుధ ఘర్షణల సమయంలో అణుభద్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ డిక్లరేషన్‌ నొక్కి వక్కాణించింది. భారత్‌, బ్రెజిల్‌లకు స్థానం కల్పిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలన్న తీర్మానం ఏండ్ల తరబడి మనదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేదే. 15 దేశాల అధినేతలతో ప్రధాని ద్వైపాక్ష‍ిక చర్చలు జరిపి, సంబంధాల బలోపేతానికి ప్రయత్నించడం సరైనదే. ఇరాన్‌ సుప్రీం నేతసహా అత్యున్నత నాయకత్వాన్ని ఏకపక్ష‍ంగా అమెరికా, ఇజ్రాయిల్‌ అంతమొందించి నప్పుడు సంతాపం తెలియజేయడానికి మీనమేషాలు లెక్కించిన మోడీ ఇరాన్‌ను శాంతింపజేయడానికా అన్నట్టు ఆ దేశ అధ్యక్ష‍ుడికి ప్రాధాన్యత ఇవ్వడం కొంత మెరుగు. అతిథుల ఆహారపు అలవాట్లకు గానీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపే భారతీయ ప్రత్యేకతలకు గానీ చోటులేకుండా శాకాహారానికే బ్రిక్స్‌ దేశాల అతిథుల విందును పరిమితం చేయడంతో ఢిల్లీ పెద్దల కురచబుద్ధి మరోసారి వెల్లడయింది. ఇరుదేశాల మధ్య ఉన్న అంతరాలను, సరిహద్దు విభేదాలను సాధారణీకరించు కోవాలన్న సంకల్పం మోడీ, జిన్‌పింగ్‌లలో కనిపించడం భారత్‌, చైనాలకు ప్రయోజనకరం. బహుళ ధ్రువ ప్రపంచానికి చోదక శక్తిగా వర్ణిస్తూ ఓపెన్‌ సోర్స్‌ ఎఐ కోసం జిన్‌పింగ్‌ చేసిన ప్రతిపాదన, కొత్త బీమా యంత్రాంగం కోసం పుతిన్‌ చేసిన సూచన ఆచరణలోకి రావడం అవసరం. బ్రిక్స్‌ ప్రారంభం నుంచీ స్పష్టమైన విధానాలు పెద్దగా రాని వేదిక నుంచి న్యూఢిల్లీలో భారత్‌ అధ్యక్ష‍తన నాలుగోసారి సాగిన డిక్లరేషన్‌ గ్లోబల్ సౌత్‌ ప్రతిష్టను పెంచడం ప్రశంసనీయం. బిక్స్‌ దేశాల ఐక్యత బహుళ ధ్రువ ప్రపంచానికి ఆశాకిరణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -