ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ ) ఎంత అన్నది మొట్టమొదట 1867-68 సంవత్సరానికి గాను దాదాభాయ్ నౌరోజీ అంచనా వేశారు. అయితే ఆ అంచనా చాలా మొరటు పద్ధతితో కూడినది. 1931-32 సంవత్సరానికి సంబం ధించిన జీడీపీ అంచనాలను వి.కె.ఆర్.వి. రావు మొదటిసారి జాగ్రత్తగా పద్ధతులను పాటించి రూపొందించారు. 1949 నుంచీ క్రమం ప్రకారం అధికారికంగా జీడీపీ అంచనాలను రూపొందిం చడం కొనసాగింది. బ్రిటిష్ పాలనలో భారతీ యులు ఎంతగా దారిద్ర్యంలోకి నెట్టబడ్డారో తెలియజెప్పడం కోసం తొలినాళ్లలో జీడీపీ అంచనాల పట్ల శ్రద్ధ చూపారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశం ఎంతమేరకు పురోగమిస్తున్నదో పరిశీలన చేయడానికి క్రమం తప్పకుండా అంచనాలు రూపొందించ సాగారు. ఆ విధంగా జీడీపీ అంచనాలు అనేవి ఒక దేశంగా మనం ఉనికిలోకి వచ్చిన క్రమంలో, ‘‘దేశ నిర్మాణం’’ కోసం జరుగుతున్న కృషిలో భాగంగా రూపొందుతూ వచ్చాయి. వలస పాలన నుంచివిముక్తి పొందిన తక్కిన మూడవ ప్రపంచ దేశాలలో కూడా ఇదే మాదిరి ప్రయత్నం సాగింది. అయితే వేరు వేరు దేశాలు తమకు అనువైన పద్ధతులను అనుసరించి జీడీపీ అంచనాలను రూపొందించుకోసాగారు.ప్రపంచీకరణ క్రమం ప్రారంభం అయ్యాక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఆ యా దేశాల జీడీపీ అంచ నాలు అవసరం అయ్యాయి. ఏ దేశంలో తమ పెట్టుబడులను ఏ మోతాదులో పెట్టాలో నిర్ణయించు కోడానికి ఈ అంచనాలు కావాలి. ఆ విధంగా ఒకప్పుడు దేశ నిర్మాణానికి సూచికగా తోడ్పడిన జీడీపీ అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి సూచికగా మారిపోయాయి.
అందుకోసం జీడీపీ అంచనాలు వేరు వేరు పద్ధతులను అనుసరించి రూపొందిం చడం కాకుండా ఒకే ప్రామాణిక పద్ధతిని అనుసరించడం అవసరం అయింది. అప్పుడే ప్రపంచం మొత్తం మీద పెట్టుబడులు పెట్టే విషయంలో ఒక అంచనాకు రావడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి వీలౌతుంది. ఐరాస, ఐఎంఎఫ్ అటువంటి ఏకరూప విధానాన్ని అన్ని దేశాలూ అనుసరించేట్టు సూచించాయి. దానినే అందరూ ఆమోదించి అమలు చేయడం జరుగుతోంది.అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి చాలా రకాల అంచనాలు అవసరం. అందుచేత ‘‘చప్పున వేసే అంచనాలు’’ (క్విక్ ఎస్టిమేట్స్), ‘‘సవరించిన అంచనాలు’’ (రివైజ్‌డ్ ఎస్టిమేట్స్), వగైరాలన్నీ అదనంగా అవసరమయ్యాయి. ఇటువంటివి అంతకు మునుపు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో మాత్రమే రూపొందించేవారు. ఇప్పుడు మూడవ ప్రపంచ దేశాలలో కూడా అదే మాదిరిగా అంచనాలు వేయాల్సి వచ్చింది. అందుకోసం సంపన్న పెట్టుబడిదారీ దేశాల మాదిరిగానే మూడవ ప్రపంచ దేశాలు కూడా పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్థలోకి పరిణామం చెందినట్టు పరిగణించసాగారు. కాని ఇది వాస్తవానికి భిన్నం. చాలా మూడవ ప్రపంచ దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థ వలలో చిక్కుకుపోయివున్నప్పటికీ, అవేవీ పూర్తిస్థాయిలో పెట్టుబడిదారీ వ్యవస్థలుగా మారలేదు. వ్యవసా యంలో అధిక సంఖ్యలో చిన్న రైతులు చిన్నపాటి కమతాల్లో సేద్యాన్ని కొనసాగిస్తూనే వున్నారు. చాలా రకాల చేతివృత్తిదారులు ఇంకా పాత పద్ధతులలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
అవేవీ ఫక్తు పెట్టుబడిదారీ పద్ధతులు కావు.అయితే ఈ విస్తారమైన పాత, అసంఘటిత రంగాలలో జరిగే ఉత్పత్తి గురించి క్రమపద్ధతిలో ఎటువంటి గణాంక వివరాలూ సేకరించడం జరగడం లేదు. అప్పుడప్పుడూ ఈ రంగంలో వినియోగించే ముడి సరుకుల గురించి, తయారయ్యే ఉత్పత్తుల గురించి శాంపిల్ సర్వేలు మాత్రమే, సుమారు ఐదేండ్లకోసారి, జరుపుతున్నారు. ఈ రంగాలకు సంబంధించిన గణాంకాలు ప్రతీ ఏడూ సేకరించే పద్ధతి లేదు. ఇక ‘‘క్విక్ ఎస్టిమేట్స్’’ గాని, ‘‘రివైజ్‌డ్ ఎస్టిమేట్స్’’ కాని ‘‘ముందస్తు అంచనాలు’’ (ప్రిలిమినరీ ఎస్టిమేట్స్) కాని వేయడానికి ఆస్కారం ఎక్కడుంది? ఇండియాలో జీడీపీ అంచనాలను రూపొందించేటప్పుడు సంఘటిత రంగంలో, ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ రంగంలో ఏ యే ట్రెండ్స్ (ధోరణులు) వ్యక్తం అవుతాయో అవే ట్రెండ్స్ అసంఘటిత రంగానికి కూడా వర్తిస్తాయనే వైఖరిని అనుసరించారు. ఈ వైఖరి పూర్తిగా నిరాధారం, అర్ధరహితం. ఈ వైఖరిని అనుసరించడంలో రెండు సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది-ఊహించని దెబ్బ (షాక్) ఏదైనా తగిలినప్పుడు, అంటే పెద్ద నోట్ల రద్దు, లేదా కరోనా మహమ్మారి వంటివి జరిగినప్పుడు దాని ప్రభావం అసంఘటిత రంగం మీద చాలా ఎక్కువ కాలం కొనసాగు తుంది. అందుచేత కార్పొరేట్ రంగంలో వచ్చిన వృద్ధి రేటు అదే మాదిరిగా అసంఘటిత రంగంలో కూడా ఉంటుందనుకోవడం సరికాదు.
అలా చేయడం వలన అది జీడీపీని అతిగా అంచనా వేయడానికి దారితీస్తుంది. ఇటువంటి అతి అంచనా కాలక్రమంలో సర్దుకుపోతుందని కూడా చెప్పలేం. అలా సర్దుకుపోవాలంటే అసంఘటిత రంగాన్ని ఎప్పటికప్పుడు సర్వే చేయాలి. శాంపిల్ సర్వే మాదిరిగా కాకుండా తరచూ పూర్తి స్థాయిలో, జనగణన జరిగే పద్ధతిలో సర్వేలు జరగాలి. అప్పుడు మాత్రమే అసంఘటిత రంగంలోని జనాభాలో వచ్చే మార్పులను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోడం సాధ్యమౌతుంది. అలా కాకుండా సంఘటిత రంగంలోని గణాంకాలనే తీసుకుని అసంఘటిత రంగానికి కూడా వాటినే వర్తింపజేస్తే అది మొత్తంగా జీడీపీ వృద్ధి రేటును కృత్రిమంగా పెంచివేస్తుంది. సంఘటితరంగం ఆర్థిక షాక్ లను తట్టుకున్నట్టు అసంఘటిత రంగం తట్టుకోలేదు, వాటి నుంచి బయటపడి కోలుకోవడం కూడా తొందరగా జరగదు. ఇక రెండవ సమస్య-అసంఘటిత రంగంలోకి సంఘటిత రంగ కార్యకలాపాలు చొరబడడం వలన కలిగే పర్యవసానాలు. ఉదాహరణకు చిన్న కిరాణా వ్యాపారంలోకి అమెజాన్ వంటి సంస్థలు చొరబడి ఆ వ్యాపారాన్ని ఆక్రమించు కుంటున్నాయి. అప్పుడు అసంఘటిత రంగం లో వృద్ధిరేటు తగ్గిపోతుంది. కాని అమెజాన్ వృద్ధి చెందు తుంది. అప్పుడు అమెజాన్ వృద్ధి రేటునే లెక్కలోకి తీసుకుని, ఆ ప్రాతిపదిక మీదే అసంఘటిత రంగంలో కూడా వృద్ధి జరుగు తోందని పరిగణించడం తప్పు.
చిన్న వ్యాపారుల్ని మింగేస్తున్న అమెజాన్ ఏ రేటులో వృద్ధి చెందుతోందో దానిని మాత్రమే లెక్కలోకి తీసుకుని నాశనమౌతున్న చిన్న వ్యాపార రంగంలో దిగజారుతున్న వృద్ధిని పట్టించుకోక పోవడం వలన జీడీపీ అంచనాలు వాస్తవం కన్నా అతిగా రూపొందుతాయి.ఇదేదో మన ఇండియాకు మాత్రమే ఎదురౌతున్న సమస్య కాదు. మొత్తం మూడవ ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమస్య. ఈ మూడవ ప్రపంచదేశాలన్నింటా అసంఘ టిత రంగం గణనీయంగా కొనసాగు తూనే వుంది. అందుచేత మన దేశంలో జరుగుతున్న మాదిరిగానే ఆ దేశాలలో కూడా జీడీపీ వృద్ధి విషయంలో అతి అంచనాలు కొనసాగుతూనే వున్నాయి. అయితే, ప్రతీసారీ జీడీపీ అంచనాలు అతిగానే వుంటాయి అని సూత్రీకరించలేం. ఒక్కోసారి కొన్ని స్వతంత్ర మైన, ప్రత్యేక కారణాల వలన, ఒకానొక దేశపు జీడీపీని తక్కువగా కూడా అంచనా వేయడం జరగవచ్చు. ఇక్కడ మనం గమనించ వలసినది ఏమంటే అసలు జీడీపీ ని అంచనా వేయడానికి అనుసరించే విధానంలోనే పొరపాటు ఉంది. సంఘటిత రంగానికి వర్తించే వృద్ధి రేటు యథాతథంగా అసంఘటిత రంగానికి కూడా వర్తిస్తుందన్న ప్రాతిపదిక మీద ఆధారపడడం తప్పు.
అయితే, ఇలా జీడీపీని ఉన్నదానికన్నా ఎక్కువగా అంచనా వేయడం అనేది మూడవ ప్రపంచ దేశాల పాలకులకు వాటంగా ఉపయోగపడుతోంది. తమ పాలనలో దేశ వృద్ధి రేటు చాలా హెచ్చుస్థాయిలో సాధించడం జరుగుతోందంటూ గొప్పలు చెప్పుకోవడానికి పనికివస్తోంది. ఇక నయా ఉదారవాద విధానాలను బలపరుస్తూ ప్రచారం చేసే ఐఎంఎఫ్ వంటి సంస్థలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతోంది. నయా ఉదారవాద విధానాలను మూడవ ప్రపంచ దేశాల మీద బలవంతంగా రుద్దడాన్ని సమర్ధించుకోడానికి ఈ అతి అంచనాల వృద్ధి రేటును అవి సాకుగా చూపిస్తున్నాయి. నయా ఉదారవాద విధానాల ప్రవేశానికి పూర్వం రోజుల్లో జీడీపీ లెక్కల్ని చూపించి నాటకమాడడానికి అంతగా అవకాశం ఉండేది కాదు.మన దేశానికి గతంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసిన వ్యక్తి సైతం వాస్తవాలను వెల్లడిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారం 2012-2014 మధ్య మన దేశం వృద్ధి రేటును వాస్తవ రేటు కన్నా కనీసం 1.5 నుంచి 2 శాతం అధికంగా పెంచి చూపిస్తున్నారు. వాస్తవ వృద్ధి రేటు నూతన ఆర్థిక విధానాల ప్రవేశానికి పూర్వ ఎంత ఉండిందో, ఇప్పుడూ కూడా దాదాపు అంతే ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. అంటే ఈ నయా ఉదారవాద విధానాలను చేపట్టడం వలన మన దేశం అధిక వృద్ధి సాధించే దిశగా పురోగమిస్తోందంటూ గొప్పలు చెప్పుకోవడం బూటకమే అని స్పష్టం అవుతోంది.
ఎంతగా గొప్పలు పోతు న్నారో, అంతగా వాళ్ళు చెప్పుకుంటున్నది ప్రశ్నార్ధకం అవుతోంది. నమ్మశక్యం కాకుండా పోతోంది. 2025 ఏప్రిల్-జూన్ కాలంతో పోల్చినప్పుడు 2026 ఏప్రిల్-జూన్ కాలంలో 7.8 శాతం వృద్ధి సాధించినట్టు చెప్పుకుం టున్నారు. ఒకవైపు ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే వున్నాయి, హర్మూజ్ జలసంధి మూతబడి కీలకమైన పెట్రో సరుకుల రవాణా దెబ్బ తింది. మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ ఖర్చులు తగ్గించుకోమంటూ దేశ ప్రజలకు గట్టిగా సలహాలు ఇస్తున్నారు. నిజంగా ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతమే గనుక ఉంటే, ఇదంతా అవసరం లేదు కదా.2025లో వేసిన జీడీపీ అంచనాల్లో ధరల స్థాయిని తగ్గించి చూపినందువలన, 2026 వచ్చేసరికి అధిక వృద్ధి సాధించినట్టు నమోదు అవుతున్నట్టు వ్యాఖ్యాతలు చెప్తున్నారు. అయితే, ఈ విధంగా మూడవ ప్రపంచ దేశాల్లో జీడీపీ లెక్కల్ని అతిగా చేసి చూపించడం అన్నది నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం నడకలోనే అంతర్లీనంగా ఉందన్న సంగతి గమనించడం ముఖ్యం. (స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



