Tuesday, September 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఐక్యత, పోరాటం- ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ 47 ఏండ్ల ప్రస్థానం

ఐక్యత, పోరాటం- ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ 47 ఏండ్ల ప్రస్థానం

- Advertisement -

ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా 47 ఏండ్లుగా నిరంతర పోరాటం సాగిస్తున్న స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ప్రయాణం కార్మికోద్యమానికి స్ఫూర్తిదాయకం. ఎన్నో అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు, నిర్బంధాలను అధిగమిస్తూ కార్మికులను చైతన్యపరచడం ద్వారా ఆర్టీసీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఐక్యతే ఉద్యమ బలమనే సూత్రాన్ని ఆచరణలో నిరూపిస్తూ సాగిన ఈ ప్రస్థానంలో అనేక విజయాలు నమోదయ్యాయి. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత నుంచి సంస్థపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ఎదుర్కోవడం, ప్రైవేటీకరణను అడ్డుకోవడం వరకు సాగిన పోరాటాలు కార్మికుల హక్కులకు పునాదిగా నిలిచాయి.

ఐక్య పోరాటానికి పునాది
ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే… ఆర్టీసీలో 1980 వరకు పెద్దగా ఐక్య పోరాటాలు జరగలేదు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆవిర్భవించిన ఆరు నెలలకే ఈయు, ఎన్‌ఎంయులతో కలిసి ఇంటరిమ్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయడం ద్వారా ఐక్య కార్యాచరణకు పునాది పడింది. 1980 జనవరి 19న రైతులు, ప్రజల సమస్యలపై జరిగిన సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడంతో పాటు పాల్గొన్నాయి. 1982లో వేతనాల పెంపు కోసం అన్ని సంఘాలు కలిసి సమ్మె చేశాయి. అదే సమయంలో ఆర్టీసీ రెగ్యులేషన్స్‌ భారత చట్టాలకు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని కార్మికులకు వివరించి, వాటి మార్పు కోసం న్యాయపోరాటాన్ని కూడా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కొనసాగించింది. ఉద్యోగ భద్రత కోసం ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి ప్రభావాన్ని కార్మికులకు వివరించడం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నిరంతర కార్యక్రమంగా మారింది. రాయలసీమలో ప్రైవేటు బస్‌ యజమానుల అక్రమాలు, దాడులు పెరిగి ఆర్టీసీ ఆదాయాలకు తీవ్ర నష్టం కలుగుతున్న సమయంలో సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల ఆత్మస్థైర్యాన్ని కాపాడేందుకు ఉద్యమించింది. రాష్ట్రవ్యాప్త సమ్మెకు ఇతర సంఘాల నుంచి స్పందన రాకపోయినా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ స్వయంగా సమ్మె నోటీసు ఇచ్చింది. రాయలసీమ పోరాట కమిటీతో కలిసి ఉద్యమాన్ని దృఢంగా కొనసాగించింది. 1993 జూన్‌ 8న రవాణా మంత్రితో ఒప్పందం కుదిరిన తర్వాత పోరాటాన్ని విరమించింది. ఆర్టీసీ పరిరక్షణకు జరిగిన తొలి ప్రధాన పోరాటాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు
1994లో ప్రపంచ బ్యాంకు విధానాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపాయి. పన్నుల భారం పెరగడం, ప్రజలకు అందిస్తున్న రాయితీలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయకపోవడంతో సంస్థ నష్టాల్లోకి జారుకుంది. ఈ విధానాలను విశ్లేషిస్తూ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రచురించిన బుక్‌లెట్‌ కార్మికుల్లో చైతన్యం కలిగించింది. దాని ఫలితంగా 2001లో ఆర్టీసీ జేఏసీ ఏర్పడి 24 రోజుల చారిత్రాత్మక సమ్మె జరిగింది. పెంచిన పన్నులను 50 శాతం తగ్గించడం, రాయితీలలో 50 శాతం తిరిగి చెల్లించడం, తొలిసారి 9 శాతం వేతన ఒప్పందం సాధించడం, మేడేను సెలవు దినంగా పొందడం వంటి కీలక విజయాలు సాధించబడ్డాయి. 2004లో బస్‌ రూట్లు ఆర్టీసీ గుత్తుసొత్తు కాదని, కొన్ని రూట్లను ప్రైవేటు వారికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విస్తృత ప్రచారం నిర్వహించింది. ఆ ప్రచారం ఫలితంగా 2005లో అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. మొదట రెండు రోజులు, అనంతరం మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్త సమ్మె జరిగింది. ఫలితంగా బస్‌ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు రాయితీల డబ్బు వంద శాతం తిరిగి చెల్లించడం, పన్నులను తగ్గించడం వంటి ఒప్పందాలు సాధించబడ్డాయి. ఆర్టీసీని కాపాడుకోవడానికి ఐక్య పోరాటమే సమర్థవంతమైన మార్గమని ఈ విజయం మరోసారి నిరూపించింది.

54 రోజుల సమ్మె.. ఐక్యతకు నిదర్శనం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రెండు రాష్ట్రాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యక లాపాలు కొనసాగిస్తున్నది. 2015లో 2013 వేతన ఒప్పందం కోసం జరిగిన సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నిర్బంధానికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించింది. 44 శాతం ఫిట్‌మెంట్‌ లభించినప్పటికీ ఆర్టీసీ నిర్వీర్యం అవుతున్న పరిస్థితులను, కార్మికులపై పెరుగుతున్న భారాలను 2018–19లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీని ఫలితంగా కార్మికుల నుంచే సమ్మె కోసం ఒత్తిడి పెరిగింది. ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఈయు, టిఎంయులు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇచ్చాయి. అనంతరం ఆర్టీసీలోని అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. 49,700 మంది కార్మికులు సంపూర్ణ ఐక్యతతో నిర్వహించిన 54 రోజుల సమ్మె ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 26 డిమాండ్లలో 15 డిమాండ్లను పరిష్కరించాల్సిన పరిస్థితిని కల్పించింది. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 54 రోజుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా ప్రకటించేలా చేసింది. అయితే 2019 డిసెంబర్‌ 1 నుంచి కార్మికోద్యమంపై ఏర్పడిన అప్రకటిత నిషేధం కారణంగా ఈ విజయాలను విస్తృతంగా ప్రచారం చేసుకో వడంలో కార్మిక సంఘాలు కొంత వెనుకబడ్డాయి.

అయినప్పటికీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మికులను చైతన్య పరిచే కార్యక్రమాలను ఆపలేదు. 2019–21 మధ్య స్వతంత్రంగా సాగించిన కృషి, 2021 జూన్‌ నుంచి 2023 డిసెంబర్‌ వరకు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణకు దారితీసింది. రాష్ట్ర రాజకీయ పరిణామాల ప్రభావంతో కార్మికోద్యమంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు జేఏసీలు ఏర్పడిన నేపథ్యంలో వాటిని కలిపి ఒకే ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేసేందుకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రయత్నించింది. అది సాధ్యం కాని పరిస్థితుల్లో స్వతంత్రంగా పనిచేస్తూనే అన్ని సంఘాలను ఐక్యం చేసే విధానాన్ని కొనసాగించింది. 2026లో ఈయు నాయక త్వంలోని జేఏసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అనంతరం టిఎంయు నాయకత్వం కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రకటించింది. మిగతా సంఘాలు మద్దతు ఇవ్వడంతో పాక్షిక ఐక్యతతో ప్రారంభమైన సమ్మె సంపూర్ణ ఐక్యత దిశగా మారింది.

పోరాటం ఇంకా మిగిలేవుంది
ఆర్టీసీ పరిరక్షణ ఇంకా పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఎం.వి. యాక్ట్‌-2019, విద్యుత్‌ బస్‌ విధానం, లేబర్‌ కోడ్స్‌, భారత న్యాయ సంహిత వంటి చర్యలతో ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలను వేగంగా అమలు చేస్తున్నది. ఏపీలో ఎన్డీయే భాగస్వామి తెలుగుదేశం ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ కూడా ఈ విధానాలను అమలు చేస్తున్నాయి. ఆర్టీసీని విస్తరిస్తామని చెబుతూనే బస్సులను పెంచకపోవడం, ఆర్టీసీ భూము లను స్వాధీనం చేసుకోవడం, ప్రజలను ప్రైవేటు రవాణా వైపు నెట్టడం జరుగుతున్నది. నష్టంలేని విలీనం, ఉద్యోగ భద్రత, పని భారాల తగ్గింపు, కార్మిక సంఘాలకు పూర్తి గుర్తింపు వంటి డిమాండ్లతో పాటు ఆర్టీసీని, దాని భూములను పరిరక్షించుకోవడం కోసం మరింత బలమైన ఐక్య పోరాటం అవసరం. గత 46 ఏండ్ల అనుభవం చూపిన ఐక్యతా మార్గంలో ముందుకు సాగుతూ, 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని, కార్మిక హక్కులను, కార్మికోద్యమాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. ఈ దిశగా ముందడుగు వేయడమే ఆర్టీసీ రక్షణకు నిజమైన పునాది.

వి.ఎస్‌.రావు,
94900 98890

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -