Wednesday, September 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచెరిపేస్తే చెరగని చరిత్ర ‘‘సెప్టెంబర్‌ 17’’

చెరిపేస్తే చెరగని చరిత్ర ‘‘సెప్టెంబర్‌ 17’’

- Advertisement -

ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలో ‘సెప్టెంబర్‌ 17’ ఒక మహోజ్వల ఘట్టం. దానికి నేడు విమోచనమని, విద్రోహమని, ఎవరు ఏ పేరు పెట్టినా, ఏ రాజకీయ రంగు పులిమినా దాని వెనుక నిలిచిన ప్రజల పోరాటం, త్యాగాల చరిత్ర మారదు. నిజాం నిరంకుశ పాలన, దొరల ఫ్యూడల్‌ దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా తిరగబడిన తెలంగాణ రైతుల చరిత్ర ఇది. ఆకలి, అణచివేతకు ఎదురు నిలిచిన పేదల చరిత్ర ఇది. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన కూలీల చరిత్ర ఇది. దొరల గడీల ముందు తలవంచకుండా ఆత్మగౌరవం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కమ్యూనిస్టు వీరుల చరిత్ర ఇది. వేలాది మంది ప్రజల త్యాగాలతో నిర్మితమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సృష్టించిన చారిత్రక పరిస్థితుల్లోనే హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయింది. ఈ చరిత్రకు మతం రంగు పులిమినా, ప్రజల పాత్రను మరుగున పరిచినా, ఎర్రజెండా నాయకత్వాన్ని చెరిపివేయాలని చూసినా… నాలుగు వేలమంది కమ్యూనిస్టు అమరుల రక్తంతో రాసిన చరిత్రను మాత్రం చెరిపివేయలేరు.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నేటి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం నిజాం నవాబు పాలనలోనే కొనసాగింది. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చరిత్రలో ఒక కీలక పరిణామం. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఈ విలీనం ఒక్కరోజులో జరిగిన ఘటన కాదు. దాని వెనుక తెలంగాణ పల్లెల్లో ఏళ్ల తరబడి సాగిన రైతాంగ పోరాటం, ప్రజల త్యాగాలు, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిర్మితమైన సాయుధ ప్రతిఘటన ఉన్నాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన కాలంలో బ్రిటిష్‌ పాలన పరిధిలోని 565 సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం కావడం ఒక చారిత్రక ప్రక్రియ. హైదరాబాద్‌ సంస్థానం విలీనం వెనుక సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రత్యేకమైన మైలురాయి. ఆ పోరాటంతో సంబంధం లేని రాజకీయ శక్తులు నేడు సెప్టెంబర్‌ 17కు కొత్త అర్థాలు చెబుతూ, తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చరిత్రకు మతరంగులు అద్దుతున్నాయి.

ఆకలి, వెట్టిచాకిరి, దొరల దౌర్జన్యం నుంచి తిరుగుబాటు
తెలంగాణ పల్లెల్లో భూమిని దున్నేవారు రైతులు. కానీ ఆ భూమిపై హక్కు చెలాయించేవారు దొరలు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు. ఆకలితో అలమటిస్తూ వెట్టిచాకిరి చేసే ప్రజలు ఒకవైపు ఉంటే, వారి శ్రమను దోచుకుంటూ గడీల్లో సంపదను పోగేసుకునే ఫ్యూడల్‌ పాలక వర్గం మరోవైపు ఉండేది. వెట్టి, అక్రమ పన్నులు, బలవంతపు వసూళ్లు, భూముల ఆక్రమణలు, మహిళలపై దౌర్జన్యాలు, కులవివక్ష, దొరల గడీల ముందు ప్రజలు తలవంచాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజాజీవితాన్ని అంధకారంలోకి నెట్టాయి. కష్టపడి పంట పండించిన రైతుకు హక్కు లేదు. తన శ్రమకు తానే యజమాని కావాలనుకున్న కూలీకి స్వేచ్ఛ లేదు. ఈ పరిస్థితుల్లోనే దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు చైతన్యం పెరిగింది. 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951 వరకు కొనసాగింది. ఇది కేవలం పాలకుడిని మార్చే పోరాటం కాదు. గ్రామీణ సమాజాన్ని మార్చే ప్రజా ఉద్యమం. రైతులకు హక్కులు, వెట్టిచాకిరి నిర్మూలన, దొరల గడీల ఆధిపత్యం అంతం వంటి లక్ష్యాలతో సాగిన చారిత్రక పోరాటం.

నిజాం పాలన, రజాకార్ల అరాచకాలు, ప్రజల ప్రతిఘటన
నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలనలో హైదరాబాద్‌ సంస్థానం ఫ్యూడల్‌ వ్యవస్థకు కేంద్రంగా నిలిచింది. నిజాం పాలనకు అండగా దొరలు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను అణచివేశారు. కాశీం రజ్వీ ఏర్పాటు చేసిన రజాకార్‌ ప్రైవేట్‌ సైన్యం ప్రజలపై దాడులకు పాల్పడింది. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా హింస, హత్యలు, దోపిడీలు జరిగాయి. రజాకార్లకు విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి వంటి దొరలు అండదండలు అందించారు. ఆయన రజాకార్‌ వ్యవస్థలో ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. మతపరంగా ఆయన హిందువే అన్న వాస్తవం ఈ చరిత్రలో ముఖ్యమైన అంశం. ఎందుకంటే నేటి రాజకీయ ప్రచారంలో నిజాం ముస్లిం పాలకుడు, ప్రజలు హిందువులు అనే సరళమైన మత విభజనతో మొత్తం పోరాటాన్ని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రజాకార్లకు మద్దతిచ్చిన దొరల్లో హిందువులు కూడా ఉన్నారు. అదే సమయంలో నిజాం ఫ్యూడల్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం ప్రజలు, మేధావులు, రచయితలు, ఉద్యమకారులు కూడా ఉన్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజల పక్షాన కలంతో పోరాడిన షోయబుల్లాఖాన్‌ను కాచిగూడ చౌరస్తాలో చేతులు నరికి హింసించి దారుణంగా హత్య చేశారు. షేక్‌ బందగిని కాల్చిచంపారు. దొరల దౌర్జన్యానికి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు ఆలం కుందు, కవి, రచయిత, రాజకీయవేత్త మగ్దూం మోహియుద్దీన్‌ వంటి ముస్లిం నాయకులు ప్రజల పక్షాన నిలబడ్డారు.అందువల్ల తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందువులు ముస్లిం పాలకుడిపై చేసిన పోరాటంగా చూపించడం చారిత్రక సత్యాన్ని వక్రీకరించడమే. ఆ పోరాటం మతానికి వ్యతిరేకంగా కాదు. దోపిడీకి, ఫ్యూడల్‌ ఆధిపత్యానికి, వెట్టిచాకిరికి, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సాగింది. హిందువులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, పేద రైతులు, కూలీలు సమస్త ప్రజలు ఆ పోరాటంలో భాగస్వాములయ్యారు.

కమ్యూనిస్టుల నాయకత్వం- రైతాంగ సాయుధ పోరాటం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మగ్దూం మోహియుద్దీన్‌, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి నాయకులు ప్రజలను సంఘటితం చేశారు. గ్రామాల్లో రైతు సంఘాలు, ప్రజా కమిటీలు, పోరాట దళాలు ఏర్పడ్డాయి. దొరల గడీలకు వ్యతిరేకంగా ప్రజలు సమష్టిగా నిలబడ్డారు. మహిళలు కూడా ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి నాయకురాళ్లు తుపాకీ పట్టి పోరాటానికి నాయకత్వం వహించారు. వీరనారి ఐలమ్మ భూమి హక్కు కోసం, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా నిలిచిన స్ఫూర్తిదాయక ప్రతీకగా నిలిచారు. వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన ఈ పోరాటం ఫలితంగా అనేక ప్రాంతాల్లో దొరల భూములు స్వాధీనం చేసుకుని పది లక్షల ఎకరాలు రైతులకు పంచారు. భూమి పంపిణీ ద్వారా భూమిలేని ప్రజలకు జీవనాధారం, సామాజిక స్థానం లభించింది.

ఆపరేషన్‌ పోలో- హైదరాబాద్‌ విలీనం
1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా నిజాం హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా కొనసాగించాలని ప్రయత్నించాడు. మరోవైపు తెలంగాణలో ప్రజల సాయుధ పోరాటం ఉధృతమైంది. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ సంస్థానంపై సైనిక చర్య చేపట్టింది. ఈ చర్యను ఆపరేషన్‌ పోలోగా పిలుస్తారు.భారత సైన్యం సంస్థానంలోకి ప్రవేశించడంతో నిజాం సైన్యాలు, రజాకార్‌ బలగాలు వెనుకడుగు వేశాయి. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం లొంగుబాటు ప్రకటించడంతో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయ్యే ప్రక్రియ పూర్తయింది. ఇది చరిత్రలో కీలక మలుపు. అయితే ఈ పరిణామాన్ని కేవలం భారత సైనిక చర్య ఫలితంగా మాత్రమే చూపించడం తెలంగాణ ప్రజల పాత్రను విస్మరించడమే అవుతుంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా పల్లెల్లో ప్రజలు ముందే తిరుగుబాటు చేశారు. రజాకార్లను ఎదిరించారు. దొరల గడీలను కూల్చారు. భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచారు. ప్రజా పాలనకు ప్రత్యామ్నాయ రూపాలను నిర్మించారు. ఆ ప్రజా పోరాటం సృష్టించిన పరిస్థితుల్లోనే సెప్టెంబర్‌ 17 విలీనం జరిగింది.

నిజాం లొంగిపోయినా ఆగని ప్రజాపోరాటం
సెప్టెంబర్‌ 17తో నిజాం పాలనా శకం ముగిసింది. కానీ తెలంగాణ ప్రజల సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కాలేదు. నిజాం లొంగిపోయిన తర్వాత కూడా పాత దొరలు, జాగీర్దార్లు కొత్త పరిస్థితులకు అనుగుణంగా తమ వేషాలు మార్చుకుని యూనియన్‌ సైన్యం అండతో గ్రామాలకు చేరుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పేద రైతులకు పంచిన భూములను తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించారు. ప్రజలపై దాడులు కొనసాగాయి.ఈ నేపథ్యంలో భూములను, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పోరాటం 1951 వరకు కొనసాగింది. యూనియన్‌ సైన్యాల చేతిలో వేలాది మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రాణాలు కోల్పోయారు. అంటే సెప్టెంబర్‌ 17తో తెలంగాణ ప్రజల పోరాటం ముగియలేదు. పాలకుడు మారినా దోపిడీ వ్యవస్థ కొనసాగినంతకాలం ప్రజల పోరాటం కొనసాగుతుందని ఈ చరిత్ర స్పష్టం చేసింది. విలీనం అనంతరం నెహ్రూ-పటేల్‌ మార్గదర్శ కత్వంలో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ను రాజ్యాంగ బద్ధమైన ‘రాజప్రముఖ్‌’గా కొనసాగించారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. రజాకార్‌ వ్యవస్థాపకుడు కాశీం రజ్వీని పాకిస్తాన్‌కు పంపించిన పరిణామం కూడా విలీనం తర్వాతి రాజకీయ వాస్తవాల్లో భాగమే. కాబట్టి సెప్టెంబర్‌ 17ను కేవలం ‘విమోచన’ అనే ఒక్క పదంతో ముగించడం చరిత్రను అసంపూర్ణంగా చూపించడమే.

చరిత్రను మత ఘర్షణగా చూపే కుట్రలు
సెప్టెంబర్‌ 17ను కొందరు ‘విమోచన దినం’గా, మరికొందరు ‘విద్రోహం’ వంటి పేర్లతో వివరిస్తున్నారు. పేర్లు మారినా, అసలు ప్రశ్న మాత్రం ఒకటే-సెప్టెంబర్‌ 17కు దారి తీసిన ప్రజా చరిత్రను ఎందుకు మరుగున పెడుతున్నారు? బీజేపీతో సహా కొన్ని రాజకీయ శక్తుల ప్రచారంలో ఈ చరిత్రను హిందూ-ముస్లిం ఘర్షణగా చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. నిజాం ముస్లిం పాలకుడు, ప్రజలు హిందువులు అనే వాదనతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఒక మత విమోచనగా చిత్రించడం చరిత్రను వ్రకీకరించడమే. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన షోయబుల్లాఖాన్‌, షేక్‌ బందగి, ఆలం కుందు, మగ్దూం మోహియుద్దీన్‌ వంటి ముస్లిం ప్రజా నాయకుల పాత్రను విస్మరించలేం. రజాకార్లకు మద్దతిచ్చిన హిందూ దొరల పాత్రను కూడా దాచి పెట్టలేం. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి ఉదాహరణ ఈ చరిత్రను మతపరమైన గీతలతో అర్థం చేసుకోవడం ఎంత పరిమితమైనదో తెలియజేస్తుంది.

సెప్టెంబర్‌ 17 నిజాం పాలన ముగిసిన తేదీ మాత్రమే కాదు. అది తెలంగాణ ప్రజలు సాగించిన మహత్తర పోరాటానికి చారిత్రక మైలురాయి. అది మత విజయం కాదు-ప్రజాశక్తి విజయం. అది పాలకుల దయ కాదు-రైతులు, కూలీలు, మహిళలు, గిరిజనులు, పేద ప్రజలు పోరాడిన హక్కుల చరిత్ర. అది ఒక్కరోజు సైనిక చర్య కాదు-ఏండ్ల తరబడి సాగిన ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన పరిణామం. ఈ చరిత్రను మతవిద్వేషాలకు ఆయుధంగా మార్చే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. ప్రజల పోరాట చరిత్రను ప్రజలకే తిరిగి అందించడం, ఆ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఎదుర్కోవడం-అదే సెప్టెంబర్‌ 17కు నిజమైన స్ఫూర్తిదినం. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం. అదే మన చారిత్రక కర్తవ్యం.

జూలకంటి రంగారెడ్డి, 9490098349

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -