18న ‘హలో అంబేద్కరైట్స్-ఛలో హైదరాబాద్’
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం
నవతెలంగాణ-హైదరాబాద్:
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకం రాస్తున్నారంటూ ఆరోపిస్తూ.. దాని విడుదలను అడ్డుకోవాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న ‘హలో అంబేద్కరైట్స్-ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మంచాల లింగస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా ఆరెస్సెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అంబేద్కర్‌ను కేవలం దళితుల నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ‘హమారా ప్రసాద్’ అనే పేరుతో రచయితగా పేర్కొంటూ ‘కల్పిత నాయకుడు’ అనే పుస్తకాన్ని ఈనెల 18న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారని, దాని విడుదలను అడ్డుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బహుజనులు, ఫూలే-అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక ఉద్యమకారులు, యువత, కవులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు దాసరి విశాల్, డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పుణ్య భాను ప్రకాశ్, మాల సంఘాల జేఏసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాస శిఖర్, అంబేద్కర్ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరాఠి మణిదీప్, అఖిల భారత విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ఉదయ్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బొడ్డు వసంతి, శివాని, మాల ప్రజా ఫ్రంట్ హైదరాబాద్ అధ్యక్షుడు మేసే నాందేవ్, సామాజిక ఉద్యమకారులు కల్పన, కుమార్, ఎలిజాల సురేష్, ఆలిండియా సమతా సైనిక్ దళ్ నాయకులు ఓం ప్రకాశ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



