Thursday, March 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపెట్రోల్‌ పరేషాన్‌

పెట్రోల్‌ పరేషాన్‌

- Advertisement -

రాష్ట్రమంతటా బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డుల దర్శనం
గ్యాస్‌ సిలిండర్ల ఏజెన్సీల వద్ద ఇదే పరిస్థితి
వాహనాదారుల పోటెత్తడంతో నిల్వలు ఖాళీ
బారులుతీరిన జనంతో జాతర
బైక్‌కు రూ.200, కారుకు రూ.వెయ్యి
సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 3 కిలోమీటర్ల మేర రద్దీ
కొంతమంది బాటిల్స్‌, డబ్బాల్లో నింపి పెట్టుకుంటున్న వైనం
హైదరాబాద్‌ సహా జిల్లాల్లో పలు చోట్ల మూతపడిన బంకులు
ఇంధన కొరత లేదు : తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా పెట్రోల్‌ బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఇదే పరిస్థితి. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరత నెలకొందంటూ పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొరత లేదని అధికారులు, పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం భయందోళనతో గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులకు పరుగులు తీస్తున్నారు. ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల వద్ద.. వాహనాలతో పెట్రోల్‌ బంకుల వద్ద రాత్రీపగలు తేడా లేకుండా గంటల తరబడి బారులు తీరుతున్నారు.

దీంతో పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు ఎప్పటికప్పుడూ ఖాళీ అయ్యి నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనదారుల రద్దీ నెలకొంది. సీఎన్‌జీ గ్యాస్‌ కోసం దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఆటోలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్‌ ఖండించింది. ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 460కి పైగా పెట్రోల్‌ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్‌ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్‌ గ్యాస్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి.

కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, బేగంపేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అబిడ్స్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురంలోని పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూశారు. ఓ వైపు పెట్రోల్‌ కొరత లేదంటూనే మరోవైపు బంక్‌లో గంటల తరబడి నిలబడితే బంక్‌ సిబ్బంది కేవలం అరకొరగా పెట్రోల్‌ కొడుతున్నారని సిటీజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మూసారాంబాగ్‌ ప్రాంతంలోని ఒక పెట్రోల్‌ బంకులో బైకుకు రూ.200.. కారుకు రూ.1000 పెట్రోల్‌ మాత్రమేనంటూ బోర్డులు పెట్టేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది బాటిల్స్‌, డబ్బాల్లో నింపి పెట్టుకోవడం గమనార్హం.

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం బారులు
సీఎన్‌జీ గ్యాస్‌ కోసం బుధవారం అంబర్‌పేటలో మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో వేచి ఉండటం ఇందనం కొరత పరిస్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌ సహా జిల్లాల్లోనూ పలు చోట్ల కొన్ని బంకులు మూతపడ్డాయి. నగరంలో వాహన ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని బంక్‌ల వద్ద ఆటోలు ఎల్‌పీజీ, సీఎన్‌జీ కోసం భారీగా క్యూ కట్టాయి.

మూడింతలు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ డిమాండ్‌
రోడ్డెక్కిన తర్వాత ఏ బంకు దగ్గర చూసినా క్యూలే దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో కార్లు, బైక్‌లు పెట్రోల్‌, డీజిల్‌ కోసం నిలబడ్డ దృశ్యాలే కనబడుతున్నాయి. మరో రెండ్రోజులు పోతే అస్సలు దొరకదంట.. బంకులు మూసేసి లాక్‌డౌన్‌ పెడతారంట అనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఇదే సమయంలో చాలా బంకుల దగ్గర నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకులకు పరుగులు తీస్తున్నారు. ధర ఎంత పెరిగినా.. రూ.100 మాత్రమే కొట్టించుకునే బ్యాచ్‌ సైతం రూ.ఇప్పుడు రూ.500కు పైగా కొట్టించేస్తున్నారు.

కొంత మంది అప్పులు చేసి మరీ పెద్ద వాహనాల్లో ఫుల్‌ ట్యాంక్‌ చేయిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచే జిల్లాల్లోని ప్రతి పట్టణ కేంద్రంలో పెట్రోల్‌ బంకుల వద్ద భారీగా వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ కోసం బారులు తీరారు. మరి కొందరైతే వాటర్‌ క్యాన్లు, ప్లాస్టిక్‌ డబ్బాలతో పెట్రోల్‌ బంక్‌కు పరుగులు తీస్తున్నారు. ఆదిలాబాద్‌లోని దస్నాపూర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో మాత్రం బంక్‌ నిర్వాహకులు ఎలాంటి కొరత లేదంటూ మైక్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వాటర్‌ బాటిళ్లతో వచ్చే వారికి పెట్రోల్‌ పోయడం లేదు. పుకార్ల కారణంగానే ఈ సమస్య వచ్చిందని అధికారులు అంటున్నారు.

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు : మర్రి అమరేందర్‌ రెడ్డి, తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు
రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిల్వలున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు చేసుకోవద్దు. ఇంధన కొరత గురించి తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావడం వల్ల, చాలా మంది పెట్రోల్‌ బంకులకు పరుగులు తీస్తూ అనవసరంగా ట్యాంకులు నింపుకుంటున్నారు. అమ్మకాలు సాధారణ స్థాయిల కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయి.

ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక రిటైల్‌ అవుట్‌లెట్లలో తాత్కాలికంగా నిల్వలు నిండుకున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌లో ఇంధన కొరత ఏమాత్రం లేదు. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ను డబ్బాల్లో నిల్వ చేయడం ‘పీఈఎస్‌ఓ’ నిబంధనలకు విరుద్ధం. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -