Thursday, March 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబకాయిలు అడిగితే అరెస్టులా?

బకాయిలు అడిగితే అరెస్టులా?

- Advertisement -

విడుదల చేయకుంటే ఉద్యమం ఉధృతం
చలో అసెంబ్లీలో నినదించిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
ముట్టడించేందుకు దూసుకెళ్లిన విద్యార్థులు
అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్త పరిస్థితులు
నేడు దిష్టిబొమ్మల దహనానికి పిలుపు
విద్యార్థులను పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన బకాయిల గురించి అడిగితే అరెస్టులు చేస్తారా? ప్రజాపాలన అంటే ఇదేనా? అని విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఇదే అంశంపై భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహాన్ని వెల్లడించింది. ఎన్నికలకు ముందు విద్యా రంగానికి కనీసం 15శాతం కేటాయిస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు పరుగెత్తుకొచ్చారు. వివిధ మార్గాల్లో పోలీసులను తప్పించుకుంటూ అసెంబ్లీ సమీపంలోకి వచ్చిన వారిని పోలీసులు బలవంతంగా అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు విద్యార్థుల చుట్టుముట్టడంతో వారంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని మరింత బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. అరెస్టయిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. మమత, డి. కిరణ్‌, కె.అశోక్‌ రెడ్డి, కె. ప్రశాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కె. వై.ప్రణయ్, ఆకారపు నరేష్‌, కార్తీక్‌, లెనిన్‌, లవకుమార్‌, పట్ల మధు, జ్యోతిబసు, నవ్య, జ్ఞాప్నిక, శ్రీకాంత్‌, తరంగ్‌, రాజేష్‌, రాహుల్‌, నందు తదితర రాష్ట్ర నాయకులున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీ కాంత్‌ మాట్లాడుతూ విఔద్యారంగ సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా ఉద్యమాలపై అణచివేత ధోరణితో ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 8500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, రాష్ట్ర బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి కనీసం 20శాతం కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో సుమారు 70 శాతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. వాటితో పాటు అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీ లకు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని కోరారు.

రాష్ట్రంలో ఏకపక్షంగా నూతన జాతీయ విద్యా విధానం -2020 అమలు చేస్తామని ప్రకటించడాన్ని రజనీకాంత్‌ ఖండించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, అది అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ , నాన్‌-టీచింగ్‌ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వసతి గృహ విద్యార్థులకు ఇవ్వాల్సిన మెస్‌చార్జీల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ”బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం” కింద ఉన్న రూ. 218 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఖమ్మం, ఆదిలా బాద్‌ జిల్లా కేంద్రాలుగా జనరల్‌ యూనివర్శిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై దాడులు చేసి ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
అక్రమ అరెస్టులకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. అర్ధరాత్రి ఇండ్లకు, హాస్టల్స్‌కు, యూనివర్శిటీలకు పోలీసులను పంపి నిందితుల్లా అక్రమంగా అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వందలాది మంది నాయకులను అర్థరాత్రి నుంచి అక్రమంగా అరెస్ట్‌ చేశారని తెలిపారు. సమస్యలు పరిష్కరించుకుండా రేవంత్‌ రెడ్డి సర్కారు అహంకారంతో, ముందస్తు అరెస్టుల పేరుతో పోలీస్‌ రాజ్యం నడుపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన విద్యా కమిషన్‌ సమస్యల పరిష్కారం కోసం 18 శాతం నిధులు కేటాయించాలని చెబితే ఆ సిఫారసులను పెడ చెవిన పెట్టారని తెలిపారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల చేతులను పోలీసులు తీవ్ర గాయాలు చేశారనీ, పిడి గుద్దులు గుద్దుతూ, అమ్మాయిలపై కూడా విచక్షణ మరిచి దాడి చేశారని విమర్శించారు. ఈ అరెస్టులను మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.

సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించాలనుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. అఫ్జల్‌ గంజ్‌, బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్‌, రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య పరామర్శించారు. హామీలను అమలు చేయాలని కోరిన విద్యార్థులను అరెస్ట్‌ చేయడమేంటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. నేటికి విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించ తలపెట్టిన నిరసనలకు వారు పూర్తి మద్దతు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -