ఎదిరించి పోరాడుతా
గౌరవం లేని చోట ఎందుకు ఉండాలి?
భజన చేసే వారికే పదవులా..? నాకు అర్హత లేదా?
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్
ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలోకి..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌లో 40 ఏండ్ల నిస్వార్థ రాజకీయ ప్రస్థానం.. 20 నెలల మానసిక క్షోభ.. సొంత పార్టీలోనే ఎదురైన అవమానాలకు ముగింపు పలుకుతూ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జగిత్యాలలో భారీగా తన అనుచరులు, అభిమానుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు రాష్ట్ర నాయకత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపిస్తూ.. సీఎం ఒంటెద్దు పోకడలు, పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహం, నామినేటెడ్ పదవుల పంపకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎంత మందిని తొక్కుతావ్..నీ దయాదాక్షిణ్యాలకు లొంగేది లేదు.. ఎదిరించి పోరాడుతా’ అంటూ సీఎంకు సవాల్ విసిరారు. భావోద్వేగ వాతావరణంలో కార్యకర్తల సమక్షంలో రాజీనామా లేఖను విడుదల చేసిన జీవన్‌రెడ్డి, తన ఆవేదనను పంచుకున్నారు. తన సొంత అనుచరుడి హత్య జరిగితే, ముఖ్యమంత్రి కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని, ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని, అందుకే బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను వీడినా.. ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతానని ప్రకటించారు.
రాహుల్ సిద్ధాంతాలకు తూట్లు.. ఫిరాయింపులపై ఫైర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ శ్రేణులకు ఇష్టం లేకపోయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ ముందుకు వెళ్తుంటే, రాష్ట్ర నాయకత్వం ఆ విలువలను నీరు గారుస్తోందని విమర్శించారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల ఓటమికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని విశ్లేషించారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్‌ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకుంటే, ముందు ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాల్సిందని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే.. రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయడం వల్లే సికింద్రాబాద్ సీటు కోల్పోయామని తెలిపారు.
చేవెళ్ల నుంచి ముందుగా సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసి, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం వల్లే ఓటమి పాలయ్యామన్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఓటమికి కూడా రేవంత్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదగాలంటే రాహుల్ గాంధీ విధానాలు పాటిస్తే సరిపోదని, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ ఆయన దయాదాక్షిణ్యాలపై బతికే వారికే గుర్తింపు దక్కుతోందని ఆరోపించారు. ‘వేం నరేందర్‌రెడ్డి ఎవడు? ఆయన పార్టీకి చేసిన సేవ ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) పదవి ఇచ్చారు. ఈ 20 నెలల్లో వ్యవసాయ రంగంపై ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటో చెప్పాలి. నాకు అర్హత లేకనా పదవులు ఇవ్వలేదు?’ అని ప్రశ్నించారు. ‘ఈ పార్టీ నాది.. నాకెవడైనా అడ్డమొస్తే తొక్కుతా’ అన్నట్టుగా రేవంత్‌రెడ్డి వైఖరి ఉందన్నారు. ‘ఎంతమందిని తొక్కుతావ్ నువ్వు? నీ తొక్కుడుకు భయపడేది లేదు. నీతో అణగదొక్కబడే కంటే ఎదిరించి పోరాడితే పోయేదేముంది?’ అని అన్నారు.
ఎంతమందిని తొక్కుతవ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



