నవతెలంగాణ-హైదరాబాద్ : మైసూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పై అధికారి వేధింపులు, మితిమీరిన పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గత నాలుగు నెలలుగా తనకు కనీసం వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) కూడా ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తూ ఆమె రాసిన ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) ప్రస్తుతం కలకలం రేపుతోంది. మైసూరులోని హినకల్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే, నాగేశ్వరి (24) అనే యువతి టాటా సంస్థలో ప్రమోటర్‌గా విధులు నిర్వహిస్తోంది. నాలుగు నెలల క్రితం డాలీ అనే మహిళ సూపర్వైజర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని నాగేశ్వరి తన సూసైడ్ నోట్లో పేర్కొంది. గత నాలుగు నెలలుగా ఒక్క వీక్లీ ఆఫ్ కానీ, ఇతర సెలవులు కానీ మంజూరు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల అత్యవసర పని నిమిత్తం ఒకరోజు సెలవు కోరగా, అందుకు నిరాకరించడమే కాకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వాపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నాగేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది.



