నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ సూట్‌కేసులో ముక్కలుగా నరికి, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు చెన్నై చేరుకున్నారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో జనరల్ బోగీలోని వెనుక భాగంలో ఎరుపు రంగు ట్రాలీ సూట్‌కేసు నుంచి రక్తం, దుర్వాసన రావడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే రైల్వే సహాయ నంబరు 139కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అప్పటికే రైలు బయలుదేరడంతో అధికారులు ఆ సమాచారాన్ని తర్వాతి స్టాప్ అయిన ఆగ్రా స్టేషన్‌కు అందించారు. ఆగస్టు 5వ తేదీ తెల్లవారుజామున రైలు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులు సూట్‌కేసును తెరచి చూడగా ముక్కలుగా నరికిన ఓ వ్యక్తి శరీర భాగాలు ప్లాస్టిక్ కవర్లో చుట్టి కనిపించాయి. తల సహా కొన్ని ముఖ్యమైన శరీరభాగాలు లేవు. సూట్‌కేసులో చెన్నైలోని ప్రముఖ వస్త్ర దుకాణ కవర్లు, చెన్నై దుకాణాలకు సంబంధించిన రసీదులు లభించాయి. వీటన్నంటినీ పరిశీలించిన అధికారులు సూట్‌కేసును చెన్నైలోనే రైలు ఎక్కించి ఉంటారన్న అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో చెన్నై చేరుకున్న ఉత్తరప్రదేశ్ పోలీస్ బృందం చెన్నై పోలీసుల సాయంతో దర్యాప్తు చేస్తోంది. తమిళనాడు రైల్వే పోలీసులు ఇప్పటివరకు చెన్నై సెంట్రల్, చెన్నై పార్క్, చెన్నై తాంబరం వంటి రైల్వే స్టేషన్ల మార్గాలలోని సుమారు 350పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఓ పురుషుడు, ఓ మహిళ ఎరుపురంగు సూట్‌కేసుతో చెన్నై సెంట్రల్ స్టేషన్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు లభించాయని పోలీసులు తెలిపారు. వారు సూట్‌కేసును రైలులో ఎక్కించి రైలు బయలుదేరక ముందే దిగి చెన్నై పార్క్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లారని, అక్కడి నుంచి తాంబరం వెళ్లే సబర్బన్ రైలు ఎక్కారని పేర్కొన్నారు. పోస్టమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాకే ఇతర వివరాలు తెలుస్తాయని వివరించారు.
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో సూట్‌కేస్ కలకలం..ముక్కలుగా నరికి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



