నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పలు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026, గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు-2026, కేరళ (పేరు మార్పు) బిల్లు-2026, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026తో సహా నాలుగు కీలక బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ప్రవేశపెట్టారు.
అయితే గత నెల జూలై 20న జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య, రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన కొనసాగించారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగింది. సభ ఆమోదించిన ఎనిమిది బిల్లులలో ఆరు బిల్లులు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.



