Tuesday, August 11, 2026
E-PAPER
Homeజాతీయంస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్ర ముప్పు..హైఅలర్ట్!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్ర ముప్పు..హైఅలర్ట్!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాదులు సరిహద్దుల వద్ద లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులకు పాల్పడవచ్చన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేస్తూ కీలక చర్యలు చేపట్టింది.

ఆగస్టు 15న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో భద్రతా బలగాల దృష్టి వేడుకలపై కేంద్రీకృతమై ఉంటుందని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని ఐఎస్ఐ భావిస్తున్నట్లు ‘ఇంటెలిజెన్స్ బ్యూరో’ (ఐబీ) అధికారి ఒకరు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), బలూచిస్థాన్‌లో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఐఎస్ఐ ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులను చొరబడేలా చేయడం, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా పంపడం వంటి ప్రయత్నాలు జరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతేకాకుండా, భద్రత తక్కువగా ఉండే టైర్-2 నగరాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కొన్నిసార్లు భద్రతా ఏజెన్సీల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ఢిల్లీ లేదా కశ్మీర్‌లో దాడులంటూ తప్పుడు సమాచారం సృష్టించి, మరోచోట దాడికి దిగే వ్యూహం కూడా ఐఎస్ఐ అనుసరించవచ్చని ఓ అధికారి వివరించారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ‘ఆపరేషన్ అలర్ట్’ను ప్రారంభించింది. ఆగస్టు 10 నుంచి 17 వరకు కొనసాగే ఈ ఆపరేషన్‌లో భాగంగా బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తూ, నిఘా మరియు పెట్రోలింగ్‌ను గణనీయంగా పెంచారు.

మరోవైపు, బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను పటిష్టం చేసేందుకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో సుమారు 40 ‘సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో’ (ఎస్ఐబీ) యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సరిహద్దు అత్యంత సున్నితమైనది కావడంతో శాశ్వత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి చొరబాట్లు, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -