నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్‌లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు చూసేందుకు వెళ్లిన ఓ జంటపై పిట్‌బుల్ జాతికి చెందిన శునకం భీకరంగా దాడి చేసింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అంకిత్ సబర్వాల్, అతని భార్య షిఫాలీ మంగళవారం సాయంత్రం పాటియాలలోని ఘుమాన్ నగర్ ప్రాంతంలో ఓ ప్రాపర్టీ డీలర్‌తో కలిసి అద్దె ఇల్లు చూసేందుకు వెళ్లారు. వారు ఇంటి గేటు తెరవగానే, లోపలి నుంచి పిట్‌బుల్ ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొదట షిఫాలీపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. భార్యను రక్షించే ప్రయత్నంలో అంకిత్‌పైనా ఆ కుక్క దాడి చేసింది. అతని కాళ్లు, వీపుపై గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న స్థానికులు కర్రలతో వచ్చి కుక్కను తరిమివేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ దాడిలో షిఫాలీకి అయిన గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జంతువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు యజమానిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 291 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దూకుడు స్వభావం ఉన్న శునకాలను పెంచుకోవడంపై ఆంక్షలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.



