రూ.12 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభం..
ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్..
నవతెలంగాణ-కుభీర్
విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. గురువారం కుభీర్ మండలంలోని న్యూ సౌంలీ గ్రామంలో రూ. 12 లక్షల నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అదనపు గదులను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మండల నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించి, వెంటనే మంజూరు చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా న్యూ సౌంలీ గ్రామ అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. దింతో గ్రామంలో విఓ భవనాలు, రైతులకు అవసరమైన గోదాంలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు గ్రామానికి మరిన్ని మౌలిక వసతులను కల్పించేందుకు దశలవారీగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు మారుతీ, బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి,మాజీ ఎంపీపీ నగేష్, దత్తహరి పటేల్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు,బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



