Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచులు

సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచులు

- Advertisement -

గతానికి భిన్నంగా పంచాయతీల పాలన
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచులు గళమెత్తుతున్నారు. గతంలో ఉన్న సర్పంచులకు,ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, పథకాలు, పాలన, నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని ఇటీవల తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సమావేశానికి మండలంలోని 15 మంది సర్పంచుల్లో నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల సర్పంచ్లు హాజరు కాలేదు.

మిగతవారు హాజరై వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించడంతో పాటు ప్రజలకు అందాల్సిన సేవలు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఉపాధిహామీ, వైద్యం, ప్రాథమిక విద్య, అటవీ, రెవెన్యూ, ఐకేపీ, ఐసిడిఎస్, వ్యవసాయ, ఎక్సయిజ్ తదితర శాఖలకు చెందిన అంశాలపై వివరాలు అడిగారు. దీంతో సమావేశం సాధారణ అధికారుల సమీక్షకు భిన్నంగా సాగినట్లు తెలుస్తోంది.

గతంలో సమావేశాల్లో అధికారులు చెప్పిన విషయాలను విని వెళ్లిపోవడమే ఎక్కువగా కనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. గ్రామాల్లో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న సర్పంచులు వాటిపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, పథకాల అమల తీరు తెలుసుకుని మరీ ప్రశ్నిస్తుండడంతో అధికారులు సరైన సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరో 45 రోజుల తర్వాత నిర్వహించే సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని, ఏ ప్రశ్నవేసిన సమాధానం చెప్పాలని, దాటవేసే ధోరణి వద్దని, అధికారులు హాజరయ్యేలా ఎంపీడీవో చూడాలని సర్పంచులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -