నవతెలంగాణ – న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్‌కు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ మద్దతు ప్రకటించారు. గురువారం ఆమె కేరళం సంప్రదాయ శైలిలో చీర ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. కేరళం సంస్కృతి, సంప్రదాయాలకు సంఘీభావంగా ఆమె ఈ వస్త్రధారణను ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను జాన్ బ్రిట్టాస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. బుధవారం బీజేపీ ఎంపీ సుస్మితాదేవ్.. జాన్ బ్రిట్టాస్‌ను ‘లుంగీవాలా’ అంటూ వ్యాఖ్యానించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బ్రిట్టాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దక్షిణాది భారతీయుడిగా, మళయాళీగా ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. మళయాళ భాష, సంస్కృతి, సంప్రదాయ వస్త్రధారణ, ఆహారం పట్ల కూడా తనకు గర్వం ఉందన్నారు. జనాభాలోని ఒక వర్గాన్ని అవమానించేందుకు లుంగీని ఒక ఆయుధంగా ఉపయోగించడం సరికాదని బ్రిట్టాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జయాబచ్చన్ కేరళ సంప్రదాయ వస్త్రధారణతో సభకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
సీపీఐ(ఎం) జాన్ బ్రిట్టాస్‌కు జయాబచ్చన్ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



