నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరడమే తమ ప్రధాన లక్ష్యమని భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. శ్రీలంకతో రేపు శనివారం గాలేలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత్‌కు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. గాలే వేదికగా జరిగే 50వ టెస్టు కూడా ఇదే. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. వచ్చే తొమ్మిది టెస్టుల్లో దాదాపు ఆరు లేదా ఏడు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవుతాయని గిల్ తెలిపాడు. వచ్చే ఏడాది జూన్‌లో లండన్‌లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
కాగా, శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు ముందుగానే అక్కడికి చేరుకుంది. కొలంబోలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ తో సన్నాహక మ్యాచ్ ఆడింది. ఈ అదనపు సమయం ఆటగాళ్లకు పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడిందని గిల్ చెప్పాడు. బుమ్రా లేకపోయినా భారత ఫాస్ట్ బౌలింగ్‌పై గిల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. గుర్నూర్ బ్రార్ కూడా పాత బంతితో మంచి బౌన్స్ రాబట్టగలడని పేర్కొన్నాడు. శ్రీలంకలో పిచ్ ల నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చని.. అలాంటి పరిస్థితుల్లో విభిన్న వ్యూహాలతో ఒత్తిడి పెంచాల్సి ఉంటుందని చెప్పాడు. దేవదత్ పడిక్కల్‌పై కూడా గిల్ ప్రశంసలు కురిపించాడు. గతంలో ఇండియా-ఏ తరఫున శ్రీలంకలో ఆడిన అ భవం అతడికి ఉపయోగపడుతుందని తెలిపాడు. గాలే లాంటి ఓపెన్ మైదానాల్లో గాలి దిశ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని వివరించాడు.



