Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందాలి 

ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందాలి 

- Advertisement -

జ్వరం రోగులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి 
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వసతులను పరిశీలన
నవతెలంగాణ-వనపర్తి

ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన విద్య సేవలు సకాలంలో అందించాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించిన కలెక్టర్, రోగులకు అందుబాటులో ఉన్న స్ట్రెచర్లు, వీల్‌చైర్లను పరిశీలించి వాటి వినియోగంపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్యూటీ డాక్టర్ల గదిని పరిశీలించి, దాని వినియోగం, నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

తదుపరి దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డుల కేంద్రాన్ని(యూ డీ ఐ డీ ) సందర్శించిన కలెక్టర్, దివ్యాంగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. యూ డీ ఐ డీ ప్రత్యేక గుర్తింపు కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని సీటీ స్కాన్ కేంద్రాన్ని పరిశీలించారు. సీటీ స్కాన్ కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు వేచి ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రం వద్ద షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు అవసరమైన సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా టిబి పరీక్షలు కూడా పెంచాలని సూచించారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన మరమ్మతు పనులు, అదనపు సౌకర్యాలు, అవసరమైన వైద్య పరికరాలు తదితర అంశాలపై పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. మదనాపురం మండలానికి సంబంధించి ఇటీవల పాముకాటు కారణంగా ఒక బాలుడు మరణించిన ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పాము కాటు వల్ల జిల్లాలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోవడానికి వీల్లేదని, పాము కాటు సంబంధిత కేసుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎవరైనా పాముకాటుతో అత్యవసరంగా ఆసుపత్రికి వస్తే వెంటనే వారికి చికిత్స అందించి సంబంధిత ఇంజక్షన్లను వేసి ప్రాణాపాయం నుంచి తప్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ సూపరిండెంట్ చంద్రమోహన్, వైద్య అధికారులు జావేద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -