– ఘనంగా జయంతి వేడుకలు
– చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
నవతెలంగాణ – కామారెడ్డి : బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు, ప్రముఖులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్ నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో నగరాభివృద్ధితో పాటు ప్రజారోగ్య రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిపై ఆయన రచించిన ‘పిక్టోరియల్ హైదరాబాద్’ గ్రంథం నేటికీ నగర సమగ్ర చరిత్రను తెలియజేసే ప్రామాణిక గ్రంథంగా నిలిచిందన్నారు. విద్య, సామాజిక చైతన్యం, బహుజనుల హక్కుల కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, బట్టు విఠల్, పిట్ల శంకర్, రమేష్, రాంచంద్రం, బాలరాజు, నర్సింలు, స్వామి, నితీన్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



