– నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు: విక్రమ్
నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండల కేంద్రంలో గురువారం ఆహార భద్రతాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో కిరాణా, డిస్ట్రిబ్యూషన్ షాపులు, బేకరీలు, స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పలు సంస్థలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని ఆహార ఉత్పత్తులపై లేబుల్ నిబంధనలు పాటించకపోవడం, తయారీ తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నంబర్ వంటి వివరాలు లేకపోవడాన్ని గుర్తించి, సంబంధిత వ్యాపారులకు నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
బేకరీల్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ పొందాలని, తయారీ, నిల్వ, విక్రయ సమయంలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని విక్రమ్ సూచించారు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నంబర్ వంటి వివరాలు స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.



