మన దేశంలో చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. పోషకాహారం తీసుకోరు. ఈ కారణాల వల్ల మహిళల్లో రక్తహీనత అనేది ఒక పెద్ద నిశ్శబ్ద ముప్పుగా పరిణమిస్తోంది. బాలికలు, వివాహితలు, గర్భిణులు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రక్తహీనత బారిన పడుతున్నారు. చాలామంది అలసట, తల తిరగడం, నీరసం లాంటి సమస్యలను సాధారణ శారీరక అలసటగానే భావిస్తూ.. తమ రోజువారీ పనులను కొనసాగించడానికి అలవాటు పడిపోయారు. అయితే ఈ రక్తహీనత మహిళ గర్భధారణపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతుందో ఒక అంతర్జాతీయ అధ్యయనం తాజాగా వెల్లడించింది.
మహిళల రక్తహీనతకు, మృతశిశు జననాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో భారతీయ వైద్య పరిశోధన మండలి సేకరించిన డేటా ఆధారంగా.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ సంయుక్త అధ్యయనాన్ని నిర్వహించారు. మహిళల నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. ఈ అధ్యయనం కోసం భారతదేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 2.14 లక్షల మంది గర్భిణుల వైద్య రికార్డులను పరిశీలించారు. ఇందులో పాల్గొన్న గర్భిణులలో 52% కంటే ఎక్కువ మంది మధ్యస్థం నుంచి తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
పెరిగిన ప్రమాదం
సాధారణ గర్భిణులతో పోలిస్తే.. మధ్యస్థం నుంచి తీవ్రమైన రక్తహీనత (హీమోగ్లోబిన్ స్థాయి 10 గ్రా/డెసిలీటర్ కంటే తక్కువ) ఉన్నవారిలో మృతశిశువు పుట్టే ముప్పు 27% ఎక్కువగా ఉందట. తీవ్రమైన రక్తహీనత ఉన్న మహిళల్లో గర్భం దాల్చిన 29వ వారంలోనే మృతశిశు జననాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది. అదే సాధారణ మహిళల్లో ఇది 31వ వారంలో జరుగుతోంది. సాధారణ మహిళలతో పోలిస్తే.. తీవ్ర రక్తహీనత ఉన్న మహిళలకు మృతశిశు జననం ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందట. మధ్యస్థ రక్తహీనత ఉన్న మహిళలకు ఈ ప్రమాదం 1.2 రెట్లకు పెరుగుతుందట.
ప్రమాదం ఎందుకు
ఆక్సిజన్ కొరత : తల్లిలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల పిండానికి సరిపడా ఆక్సిజన్ అందదు, ఇది తీవ్రమైన శారీరక ఒత్తిడికి దారితీస్తుందంటున్నారు పరిశోధకులు.
పిండంలో లోపాలు : గర్భధారణ సమయంలో రక్తహీనత వల్ల పిండంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి పెరగడం లేదా గుండె సంబంధిత లోపాలు తలెత్తి శిశువు గర్భంలోనే మరణించే అవకాశం ఉందని చెబుతున్నారు.
నిపుణుల సూచనలు, సలహాలు, ముందస్తు స్క్రీనింగ్ : గర్భం దాల్చిన ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా హీమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఐరన్ సప్లిమెంట్లు : ఐరన్ లోపాన్ని నివారించడానికి వైద్యుల సలహాతో ఐరన్ టాబ్లెట్లు వాడాలని తెలియజేస్తున్నారు.
పోషకాహారం : గర్భిణులు ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మహిళల్లో రక్తహీనత అనేది సరైన అవగాహన, పోషకాహారం, సాధారణ వైద్య సంరక్షణతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు నిపుణులు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డలందరినీ కాపాడవచ్చని పేర్కొంటున్నారు.



