Sunday, September 6, 2026
E-PAPER
Homeమానవిఎక్కువ సేపు కూర్చుంటే ముప్పే

ఎక్కువ సేపు కూర్చుంటే ముప్పే

- Advertisement -

ఎక్కువ సేపు కూర్చోవటం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలిసిన విషయమే. కానీ, ఆఫీసులో పనుల వల్ల చాలా సమయం కుర్చీకే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందంటున్నారు నిపుణులు. అయితే పని మధ్యలో స్క్రీన్ నుంచి విరామం తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, పని సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే ఎంతసేపటికొకసారి లేవాలనే దానిపై చాలామందికి స్పష్టత లేదట. ఈ క్రమంలో తాజా అధ్యయనం దీనికి ఓ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది.అటూ ఇటూ కదలండి: ప్రతి గంటకు కనీసం ఐదు నిమిషాల పాటు విరామం తీసుకుని అటు, ఇటు నడవడం లేదా చిన్నపాటి కదలికలతోపని సామర్థ్యం దెబ్బతినకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని British Journal of Sports Medicine పేర్కొంది. ఇలా నడవడం వల్ల మానసిక స్థితి (మూడ్) మెరుగవుతుందని, అలసట తగ్గుతుందని తేలింది.ఐదు నిమిషాల నడకతో: గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటే ఒబెసిటీ, గుండె జబ్బులు, నిస్సత్తువ, డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి రకరకాల సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, వీటిని తగ్గించుకునే విషయంలో కదలికలకు సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాలు అంత సృష్టంగా లేవు. ఈ క్రమంలో కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ఆచరణీయమైన అంశాన్ని గుర్తించటం మీద దృష్టి సారించారు. ఐదు నిమిషాల నడకతో గుండె పనితీరు, జీవక్రియలు, మూడ్ మెరుగవుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే దీని ప్రభావాన్ని గుర్తించాలని భావించారు.పరిశోధనలో ఆసక్తికర విషయాలు : సుమారు 11,500 మందిని ఎంచుకొని రోజంతా ప్రతి అరగంటకు, గంటకు, రెండు గంటలకు ఒకసారి ఐదు నిమిషాల సేపు నడవాలని సూచించారు. రెండు వారాల తర్వాత పరిశీలించగా అందరిలోనూ ఉత్సాహం పెరగటం, నిస్సత్తువ తగ్గటం వంటి మార్పులు గమినించారు. 30 నిమిషాలకు ఒకసారి నడిచిన వారిలో మరిన్ని ఎక్కువ ఫలితాలు కనిపించాయట. అయితే, గంటకోసారి లేచి నడవటమనేది ఆచరణీయమని, సమర్థనీయమని వెల్లడైంది. అప్పుడప్పుడూ లేచి నడవటం వల్ల తిరిగి శరీరం కుదురుకుంటుందని తేలింది. కాళ్లలోని కండరాలు ఉత్తేజితమవుతాయట.

రక్త ప్రసరణ పుంజుకుంటుంది. మరీ ముఖ్యంగా మెదడుకు అవసరమైన విరామమూ లభిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కుర్చీలో కూర్చోకుండా కనీసం గంటకోసారి అయినా లేచి కాసేపు నడవటం మంచిదంటున్నారు నిపుణులు.నడక ప్రారంభించే మార్గాలు మీ మొబైల్​లో ప్రతి గంటకు ఒక చిన్న వైబ్రేషన్ లేదా అలారం సెట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఆఫీస్ కాల్స్ లేదా పర్సనల్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూర్చోకుండా, రూమ్​లోనే అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడాలని చెబుతున్నారు. మీ డెస్క్​పై పెద్ద బాటిల్ పెట్టుకోకుండా, చిన్న గ్లాసు పెట్టుకోవాలట. ప్రతి గంటకు ఒకసారి నీళ్ల కోసం ఆఫీస్​ ప్యాంట్రీకి వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. లిఫ్ట్​కు బదులుగా మెట్లను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు.- మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం తప్పనిసరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -