ఆమె చనిపోలేదు.. మన సమాజంలో మహిళలకు భద్రత ఎంత దూరంలో ఉందో ప్రశ్నగా మిగిలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, చౌటిగూడెం గ్రామానికి చెందిన 21 ఏండ్ల ఊకే శిరీష విషాదాంతం యావత్ తెలంగాణను కలచివేసింది. పేద కుటుంబంలో పుట్టి, చదువుకుని, నర్సుగా ఉద్యోగం సంపాదించి, కుటుంబానికి అండగా నిలవాలనే ఆశయంతో హైదరాబాద్ నగరానికి వెళ్లిన ఒక యువతి అత్యంత దారుణ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది.
శిరీష తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. సుమారు ఏడు నెలలుగా అక్కడ విధులు నిర్వహిస్తూ, ఆసుపత్రికి సమీపంలోని సిబ్బంది వసతి గృహంలో ఇతర నర్సులతో కలిసి నివసిస్తోంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని సుమారు రాత్రి 10 గంటల సమయంలో తన గదికి వెళ్లింది. మరుసటి రోజు సహచరులు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు కిటికీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
అత్యంత దారుణం
తొలుత శిరీష మృతి అనుమానాస్పదంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు, ప్రజా సంఘాలు సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లైంగికదాడి చేసి హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అనంతరం పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు బీహార్‌కు చెందిన 34 ఏండ్ల ఎండీ సనావుల్లా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రకారం అతడు శిరీష ఒంటరిగా ఉన్న సమయంలో గదిలోకి వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. కేకలు వేయకుండా ఉండేందుకు గొంతు నొక్కడంతో మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. శిరీష తన కుటుంబాన్ని ఆదుకోవడానికి, తన జీవితాన్ని నిర్మించుకోవడానికి, ఒక గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకుని నగరానికి వచ్చిన యువతి. ఆమె తండ్రి కొంతకాలం కిందటే అనారోగ్యంతో మరణించాడు. తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు సమాచారం. చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన శిరీష తల్లికి అండగా నిలుస్తున్న సమయంలోనే ఈ దారుణానికి బలైంది.
ఇది శిరీష విషాదం కాదు
శిరీష మరణాన్ని కేవలం ఒక క్రైమ్ కేసుగా చూస్తే అసలు సమస్యను మనం గుర్తించలేం. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాలకు వేలాది మంది యువతులు వెళ్తున్నారు. వారిలో అనేక మంది నర్సులు, ఉపాధ్యాయులు, గృహ కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, పరిశ్రమల్లో పనిచేసే మహిళలు. కుటుంబాలకు దూరంగా, కొత్త ప్రాంతాల్లో, పరిమిత రక్షణతో జీవిస్తూ తమ జీవితాలను నిర్మించుకుంటున్నారు. వారికి ఉద్యోగం మాత్రమే కాదు.. భద్రత కూడా హక్కే. ఒక మహిళ తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేయాలంటే ప్రతి అడుగులో భయం వెంటాడే పరిస్థితి ఉంటే, మనం సాధించిన అభివృద్ధి ఏంటి?
ఆడపిల్ల బయటకు వెళ్లకూడదా?
మహిళలపై నేరాలు జరిగిన ప్రతిసారీ సమాజంలో ఒక ప్రమాదకరమైన ప్రశ్న వినిపిస్తుంది.. ‘ఆమె రాత్రి ఎందుకు బయటకు వెళ్లింది?’, ‘ఒంటరిగా ఎందుకు ఉంది?’, ‘జాగ్రత్తగా ఉండాల్సింది కదా?’… కానీ అసలు ప్రశ్నలు ఇవి కావు. ఒక మహిళ రాత్రి ఇంటికి వెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా, ఒంటరిగా జీవించినా, తనకు నచ్చిన దుస్తులు ధరించినా, తనకు నచ్చిన వృత్తిని ఎంచుకున్నా.. ఆమెను వేధించడానికి, లైంగిక దాడి చేయడానికి, హత్య చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నేరానికి బాధితురాలి జీవన విధానాన్ని కారణంగా చూపడం అంటే నేరస్థుడి బాధ్యతను తగ్గించడం.
భద్రతపై ప్రత్యేక దృష్టి అవసరం
శిరీష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసీ యువతి. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే యువతుల విషయంలో ప్రత్యేక భద్రతా వ్యవస్థ అవసరం. వీరు కుటుంబాలకు దూరంగా ఉంటారు. స్థానిక పరిసరాలు పూర్తిగా తెలియకపోవచ్చు. అనేక సందర్భాల్లో ఉద్యోగ సంస్థలు కల్పించే వసతి గృహాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల ప్రైవేట్ ఆసుపత్రులు, హాస్టళ్లు, సంస్థలు మహిళా ఉద్యోగులకు వసతి కల్పిస్తే అక్కడ.. పనిచేసే సీసీటీవీ కెమెరాలు ఉండాలి. మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అత్యవసర సమయంలో వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి. ఫిర్యాదు చేయడానికి స్వతంత్ర గ్రీవెన్స్ మెకానిజం ఉండాలి. వసతి గృహాల్లో ప్రవేశం, భద్రతపై కఠిన నియమాలు ఉండాలి. మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే వేధింపులను భయపడకుండా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ కూడా నర్సింగ్ సిబ్బందికి సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని ఆరోగ్యశాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఎన్‌డీటీవీ నివేదించింది.
నిందితుడికి శిక్ష తప్పనిసరి
శిరీష కుటుంబం, ప్రజలు న్యాయం కోరుతున్నారు. ఆగ్రహంతో నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అంటే ప్రతీకారం కాదు. నిందితుడు ఎంత దారుణమైన నేరం చేసినా, దర్యాప్తు శాస్త్రీయంగా జరగాలి. ఆధారాలు పకడ్బందీగా సేకరించాలి. కేసును వేగంగా విచారించాలి. నేరం రుజువైతే చట్టం అనుమతించే అత్యంత కఠినమైన శిక్ష పడేలా ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థ పనిచేయాలి. ఎన్‌కౌంటర్ కన్నా ముఖ్యమైనది నేరస్థుడికి చట్టం ముందు తప్పించుకునే అవకాశం లేకపోవడం. ఒక కేసులో నిందితుడిని శిక్షించడం మాత్రమే కాదు, ఇలాంటి నేరాలకు పాల్పడితే తప్పకుండా పట్టుబడతామనే భయం నేరస్థుల్లో కలగాలి.
మార్పు అవసరం
మహిళలకు భద్రత ఉండాలంటే సమాజంలో మార్పు రావాలి. కుటుంబం నుంచి పాఠశాల వరకు, కళాశాల నుంచి కార్యాలయం వరకు, మీడియా నుంచి సోషల్ మీడియా వరకు.. సమాజంలోని ప్రతి వ్యవస్థలో మహిళల పట్ల గౌరవాన్ని పెంచాలి. స్త్రీని ఒక వస్తువుగా చూసే పురుషాధిక్య భావజాలం మారాలి. ‘ఆమె నా సొంతం’, ‘ఆమెను నేను నియంత్రించగలను’, ‘ఆమె నిరాకరణకు విలువ లేదు’ అనే భావనలు నేరాలకు పునాది వేస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు సమ్మతి, సమానత్వం, గౌరవం, మానవత్వం గురించి విద్య ఇవ్వాలి.
శిరీష అడుగుతున్న ప్రశ్న
శిరీష ఇక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. ‘నేను చదువుకుని ఉద్యోగం చేసుకోవడానికి బయటకు వస్తే నాకు రక్షణ లేదా?’. ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఆడపిల్లలకు ‘జాగ్రత్తగా ఉండు’ అని చెప్పడం మాత్రమే కాదు, ‘నీకు ఏం జరిగినా మేమున్నాం’ అని చెప్పే సమాజాన్ని నిర్మించాలి. ఆమెను ఇంట్లో బంధించడం పరిష్కారం కాదు. ఆమె స్వేచ్ఛను కట్టడి చేయడం పరిష్కారం కాదు. ఆమె కలలను ఆపడం పరిష్కారం కాదు. నేరస్థుడి మనస్తత్వాన్ని మార్చ డం, చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడమే పరిష్కారం. శిరీష మరణం ఒక కుటుంబం కన్నీటిగా మిగిలిపోకూడదు. అది ఒక సామాజిక మార్పుకు నాంది కావాలి. ఆమె తల్లి కన్నీటికి న్యాయం కావాలి. ఆమె కలలకు న్యాయం కావాలి. ఆమె లాంటి వేలాది ఆడబిడ్డల భద్రతకు హామీ కావాలి.
ప్రభుత్వం ఏం చేయాలి?
శిరీష ఘటనను ఒక కేసుగా ముగించకుండా ప్రభుత్వం కొన్ని శాశ్వత చర్యలు చేపట్టాలి. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక ప్రోటోకాల్. ప్రైవేట్ ఆసుపత్రులు, హాస్టళ్లు, పరిశ్రమలు, విద్యాసంస్థల్లో మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేయాలి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల తనిఖీలు. ప్రభుత్వ అధికారులు తరచుగా తనిఖీలు చేసి భద్రతా లోపాలు ఉన్న వసతి గృహాలపై చర్యలు తీసుకోవాలి. అత్యవసర స్పందన వ్యవస్థ. మహిళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్‌తో సమీప పోలీసు బృందం చేరుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.
వేగవంతమైన దర్యాప్తు, విచారణ. మహిళలపై లైంగిక దాడి, హత్య కేసుల్లో శాస్త్రీయ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ దర్యాప్తు, సాక్షుల రక్షణ, వేగవంతమైన న్యాయ ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలి.
బాధిత కుటుంబానికి పూర్తి అండ. శిరీషలాంటి యువతిని కోల్పోయిన కుటుంబం కేవలం ఒక వ్యక్తిని కోల్పోలేదు. వారి కుటుంబ ఆర్థిక, సామాజిక భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వం కుటుంబానికి ఆర్థిక సహాయం, ఉపాధి, న్యాయ సహాయం వంటి అంశాల్లో అండగా నిలవాలి.
– పూర్ణిమా యర్రంశెట్టి, 9676439996



