Sunday, August 23, 2026
E-PAPER
Homeసోపతిఅంధ భక్తులు × దిమాగీ నక్సల్స్‌

అంధ భక్తులు × దిమాగీ నక్సల్స్‌

- Advertisement -

కేతిగాడు : అవును నీవు అంధభక్తుడివి కాబట్టే నన్ను దిమాగీ నక్సలైట్‌ అని అంటున్నావు. నాకు దిమాగ్‌ ఉంది కనుకనే నక్సల్స్‌ భావజాలం తెలిసింది. అసలు నక్సలిజం పుట్టిందే కమ్యూనిజం తల్లి కడుపు నుంచే. అది వర్గ రహిత సిద్ధాంతం. సకల మానవాళి దోపిడీ విముక్తి సిద్ధాంతం. కారల్‌ మార్క్స్‌ ఏంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళిక సిద్ధాంతం రాసి 175 ఏళ్లు గడిచినా అది ఇప్పటికీ నిత్య యవ్వనమే. అది సనాతన ధర్మమనుకునే వేద పారాయణం కాదు. అమలుకు వీలయ్యే సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్రీయ సిద్ధాంతం. మానవజాతి సమాజ పరిణామ చరిత్ర అంతా వర్గ సంఘర్షణ నుండే ఉద్భవించిందని తెలిపింది. మనిషిని మనిషిగా గుర్తించడం, గౌరవించడం, కులమత, జాతి, ప్రాంత, భాషా, వర్ణ, వర్గ, లింగ బేధాలకు అతీతంగా ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కాలని కోరుకోవడం, అందుకు త్రికరణ శుద్ధిగా పనిచేసేలా ఎప్పటికప్పుడు తనని తాను సహేతుకంగా తాజాపర్చుకోవడం ఆ సిద్దాంత లక్ష్యం. రష్యాలో కామ్రేడ్‌ లెనిన్‌ బోల్షవిక్‌ పార్టీతో అలా అమలు పరచి సోవియట్‌ సోషలిస్టు రష్యాగా మార్చగలిగాడు. కామ్రేడ్‌ స్టాలిన్‌ నేతృత్వంలో ఎర్ర సైన్యం నరహంతక నాజీ హిట్లర్‌ను మట్టికరిపించి ప్రపంచ శాంతిని సాధించ గలిగింది. కామ్రేడ్‌ మావో ఆ సైద్ధాంతిక భావజాలంతో ప్రజలను లాంగ్‌ మార్చ్‌ నడిపించి జన చైనా నిర్మాణం చేయగలిగాడు. ఎన్నెన్నో విభేదాలుండవచ్చు. నక్సలిజం అతివాద దుందుడుకుతనం కావొచ్చు కానీ కమ్యూనిస్టు సిద్ధాంత భావజాలమే ఇప్పటికీ (అమెరికాతో సహా) సామ్రాజ్యవాద భావజాలాన్ని ధీటుగా ఎదుర్కోగలుగుతున్నది. అటు ఫాసిజాన్ని, ఇటు సామ్రాజ్యవాదాన్ని రాజీ లేకుండా ఏకకాలంలో ఎదుర్కొనే ధీటైన సిద్ధాంతం ఏదైనా ఈ ప్రపంచంలో వుందంటే అది ఒక్క కమ్యూనిజమే. ఆ కమ్యూనిజాన్ని చూసి అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 250 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇటీవల వణికిపోయాడు. మన ప్రధాని మోడీ ఇప్పుడు నక్సలిజాన్ని భౌతికంగా నిర్మూలించాం గాని మానసికంగా నిర్మూలించలేకపోయామని తనకు తానే ఒప్పుకుంటూ భయపడిపోతున్నాడు.

జుట్టుపోలుగాడు : నిజమేగా మరి. దిమాగీ నక్సలైట్స్‌ ఈ దేశానికి పుట్టుకొస్తున్న కొత్త శత్రువులు. వారిని ఒంటరిపాటు చేయాల్సిందే. ఎంత ప్రమాదం కాకపోతే మన ప్రధాని మోడీ ఎర్రకోట మీద నుండే సరాసరి పంద్రాగస్టు పండుగనాడు చెప్తాడు. ‘అడవుల్లో సాయుధ నక్సలైట్స్‌ను నిర్మూలించాం. అది చాలా పెద్ద విజయం అయినా మావోయిస్టు భావజాలం ఉన్నవారు సమాజంలో చాలా బలంగా పాతుకుపోయారు. అధికార పీఠంలో కూడా వారి స్థానం వుంది. ప్రభుత్వ కమిటీల్లో సలహా దారులుగా వుంటూ, తమ విధానాలతో ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నారు. వివిధ రంగాల్లో వారు చొరబడ్డారు. సమాజాన్ని తప్పుడు మార్గంలో నడపడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. హింసను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మరో అవకాశం (అధికారం) కోసం ఎదురు చూస్తున్నారు’ అని కూడా అన్నాడు.

బంగారక్క : ఏం అధికారం మీ ఒక్కరిసొత్తా ఏంది? ఇది ప్రజాస్వామ్యం. నచ్చకపోతే ఎవడినైనా ప్రజలు ఇట్టే దించేస్తారు బిడ్డా. మీ బిజెపి వాళ్లు శాశ్వతంగా అధికారం చెలాయించేందుకు నానా అడ్డదార్లు తొక్కుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటినీ తొత్తడం చేస్తున్నారు. చివరకు ‘సర్‌’ పేరుతో ఓట్‌ చోరీకి తెగబడ్డారు. కోట్ల ఓట్లు గల్లంతయ్యేలా చేస్తున్నారు. మీదో పాలనా? మీకొక విధానం? అరెరె… రాముని పేరుతో అధికారంలోకి వచ్చి చివరకు ఆ అయోధ్య రామాలయంలో సైతం అవినీతి గడ్డికరిచారు కదరా.. మిమ్మల్ని ప్రశ్నించే వారిని తుకడే తుకడే గ్యాంగ్‌ అన్నారు. అర్బన్‌ నక్సల్స్‌ అన్నారు. కాక్రోచ్‌లు అన్నారు. చైనా పాకిస్తాన్‌ ఏజెంట్లు అన్నారు. దేశద్రోహులు అన్నారు. ఇప్పుడిక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దిమాగి నక్సల్స్‌ అని అన్నారు. యస్‌. మేము దిమాగీ నక్సల్‌మే. దిమాగ్‌ వుంది కనుకనే నిక్సలిజం అంటే ఏమిటో అర్థమయింది. అంధ భక్తులకు ఏదీ అర్థం కాదు. మూర్ఖత్వమే వాళ్ల దిమాగ్‌. మతం పేరుతో మనుషుల మధ్య ద్వేషం పెంచడం, హత్యలు, అత్యాచారాలు చేయడం, దొంగ బాబాలను వెనకేసుకురావడం, రేపిస్టులను పూలదండలతో సత్కరించడం, యధేశ్చగా అవినీతికి రాచబాట పర్చడం, అంబానీ ఆదానీలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టడం… ఇవేగా మీ ఘనకార్యాలు. మీ దగా మోసాల అండం బద్దలయింది. విషపురుగులు ఒకటొకటి బయటకొస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా శాంతి సత్యాగ్రహ పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు పెల్లుబుకుతున్నాయి. దావానలం మొదలయ్యాక అది ఎటునుంచి ఎటువైపుకైనా వ్యాపిస్తుంది. దిమాగీ నక్సలిజం నిప్పుకణం రాజుకుంది.

కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -